'మా బంధం తేనె కంటే తియ్యనైనది'
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌తో తమ అనుబంధం స్టీల్ కంటే ధృడమైనదని, తేనె కంటే తియ్యనైనదని పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో చైనా వైస్ ప్రీమియర్ వాంగ్ యాంగ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కష్ట కాలంలో ఒకరి కోసం మరొకరు ఆపన్న హస్తాలు అందించుకున్నాయని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా తమ బంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పారు.
చైనా కేంద్ర పొలిట్‌బ్యూరో కమిటీలో సభ్యుడైన వాంగ్.. చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుల్లో ఒకరు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు. పర్యటనలో తొలిరోజైన సోమవారం ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్ స్వతంత్ర వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు. అభివృద్ధి దిశగా పాకిస్తాన్‌కు చైనా సాయపడుతుందని చెప్పారు.
వాంగ్‌తో పాటు చైనాకు చెందిన పలువురు అధికారులు కూడా పాకిస్తాన్‌కు విచ్చేశారు. కార్యక్రమ అనంతరం ఇరు దేశాల మధ్య భారీ స్ధాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. వన్ బెల్ట్-వన్ రోడ్‌లో అంతర్భాగమైన చైనా-పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్(సీపీఈసీ)ను ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.