
జైలు బద్దలు కొట్టి 350మంది ఖైదీలు పరార్
కాబుల్: తాలిబన్ ఉగ్రవాదుల దుశ్చర్యతో అఫ్గనిస్థాన్లో ఓ జైలు ఖైదీలు పరారయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 350మంది. తాలిబన్ ఉగ్రవాదులు ఆ జైలుపై బాంబు దాడులు జరపడమే కాకుండా పోలీసుల దుస్తుల్లో లోపలికి ప్రవేశించి నానా గందరగోళం సృష్టించడంతో అదే అదనుగా చూసుకొని అందులోని వందలమంది ఖైదీలు తప్పించుకొని వెళ్లారు. అధికారుల సమాచారం ప్రకారం స్థానిక కాలమానం సరిగ్గా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తొలుత ఓ కారు నిండా బాంబులు వేసుకొని వచ్చిన ఓ ఉగ్రవాది నేరుగా వచ్చి ఘజ్ని ప్రావిన్స్లో ఉన్న జైలు ద్వారాన్ని బలంగా ఢీకొట్టి పేల్చేశాడు. ఆ తర్వాత ఆరుగురు ఉగ్రవాదులు పోలీసులు దుస్తుల్లో లోపలికి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో జైలులోని ఖైదీలంతా పారిపోయారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు జైలు సిబ్బంది.. మరో నలుగురు భద్రతా బలగం నుంచి మరో నలుగురు, 10మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.