Taliban Militant
-
తాలిబన్లపై పాక్ ప్రొఫెసర్ సాహసం
పెషావర్: తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు కూడా ప్రేమకు నిలయాలు అని చెప్తుంటారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో వారు పెరుగుతున్న క్రమంలో విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయులకు కూడా అంతకుమించిన ప్రేమ ఉంటుందని అంటారు. పాకిస్థాన్‌లో ఓ ప్రొఫెసర్ అదే విషయాన్ని రుజువు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేస్తున్నారని తెలిస్తేనే ఆ ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు అరచేతబట్టుకొని పారిపోయే ఈ రోజుల్లో ఆ ప్రొఫెసర్ మాత్రం తన విద్యార్థులను కాపాడేందుకు తన ప్రాణాలు అడ్డుగా పెట్టాడు. ఏకంగా భారీ తుపాకులతో దూసుకొస్తున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు ఓ సైనికుడిలాగా మారి తన లైసెన్స్ తుపాకీతో వారికి ఎదురు నిలిచాడు. తన దగ్గర తుపాకీతో కాల్పులు జరిపి ఆ ముష్కరులను ఎదుర్కొనే లోపే వారు తెగబడ్డారు. ఆ ప్రొఫెసర్ పై తూటాల వర్షం కురిపించారు. దీంతో 30 ఏళ్ల ప్రాయంలోనే అతడు కన్నుమూశాడు. పాకిస్థాన్‌లో ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధులైన ఉగ్రవాదులు బుధవారం చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 24మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలోనే రసాయన శాస్త్రం బోధించే ప్రొఫెసర్ సయ్యద్ హమీద్ హుస్సేన్ (34) తన లైసెన్స్ రివాల్వర్ తో అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణాలువదిలాడు. ఆయన ప్రాణం కోల్పోయిన తీరును ఆ వర్సిటీ జువాలజీ విద్యార్థి తెలుపుతూ 'ముందు కాల్పుల చప్పుళ్లు వినగానే మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ తానుచెప్పే వరకు భవనం వెలుపలికి రావొద్దని హెచ్చరించారు. అనంతరం ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు తన తుపాకీ తీశారు. నేను చూస్తుండగానే ఆయనకు బుల్లెట్ తాకింది. ఆయన కూడా కాల్పులు జరిపారు. అయితే, అంతకంటే వేగంగా ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించడంతో నేను గోడ దూకి పారిపోయాను. మిగితా వాళ్లు కూడా అలాగే చేశారు. మా ప్రొఫెసర్ తో సహా 25మంది ప్రాణాలు విడిచారు' అని అతడు వివరించాడు. -
జైలు బద్దలు కొట్టి 350మంది ఖైదీలు పరార్
కాబుల్: తాలిబన్ ఉగ్రవాదుల దుశ్చర్యతో అఫ్గనిస్థాన్‌లో ఓ జైలు ఖైదీలు పరారయ్యారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 350మంది. తాలిబన్ ఉగ్రవాదులు ఆ జైలుపై బాంబు దాడులు జరపడమే కాకుండా పోలీసుల దుస్తుల్లో లోపలికి ప్రవేశించి నానా గందరగోళం సృష్టించడంతో అదే అదనుగా చూసుకొని అందులోని వందలమంది ఖైదీలు తప్పించుకొని వెళ్లారు. అధికారుల సమాచారం ప్రకారం స్థానిక కాలమానం సరిగ్గా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఓ కారు నిండా బాంబులు వేసుకొని వచ్చిన ఓ ఉగ్రవాది నేరుగా వచ్చి ఘజ్ని ప్రావిన్స్‌లో ఉన్న జైలు ద్వారాన్ని బలంగా ఢీకొట్టి పేల్చేశాడు. ఆ తర్వాత ఆరుగురు ఉగ్రవాదులు పోలీసులు దుస్తుల్లో లోపలికి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో జైలులోని ఖైదీలంతా పారిపోయారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు జైలు సిబ్బంది.. మరో నలుగురు భద్రతా బలగం నుంచి మరో నలుగురు, 10మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. -
'విమానాలన్నింటిని ధ్వంసం చేసేందుకే దాడి'
కరాచీ: ఎయిర్ పోర్ట్ లో పార్క్ చేసిన అన్ని విమానాలను తాలిబాన్ మిలిటెంట్లు ధ్వంసం చేయాలనుకునే లక్ష్యంతోనే కరాచీ ఎయిర్ పోర్ట్ పై దాడులు చేశారని ఓ నివేదికను పాక్ అధికారులు సమర్పించారు. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిపై ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఓ ప్రాథమిక నివేదికను అధికారులు సమర్పించారు. రెండు మార్గాల్లో విమానాశ్రాయంలోకి జొరబడిన ఉగ్రావాదుల ప్రయత్నాన్ని భద్రతా దళాలు చాకచక్యంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. విమానాశ్రయ నెట్ వర్క్ ను ధ్వంసం చేయాలనే వ్యూహంతోనే ఉగ్రవాదులు కుట్ర పన్నారని నివేదికలో వెల్లడించారు. విమానాశ్రయంపై జరిగిన దాడిని ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది సాధారణ ప్రజలతోపాటు 10 మంది ఉగ్రవాదులు ఈ ఘటనలో చనిపోయారు.