
తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం..!
ఇస్లామాబాద్ః ఉరీ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న భారత్ నుంచి ఎప్పుడు ఎటువంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న అనుమానంతో పాకిస్థాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగా పాక్ ఆర్మీ... భారత సరిహద్దుల్లో పర్యవేక్షణనును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ నేతృత్వంలో ఓ సమావేశం నిర్వహించారు. ఉరీ దాడిలో తమ ప్రమేయముందన్న భారత్ ఆరోపణలను ఈ సందర్భంలో తిరస్కరించారు.
ఉరీ ఘటన అనంతరం భారతదేశంతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దుపై తీక్షణమైన నిఘా పెట్టామని, భారత్ నుంచి ఎటువంటి స్పందన ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. తూర్పు సరిహద్దుల్లోని పరిణామాలను తాము ఎప్పటికప్పుడు దగ్గరగా పరిశీలిస్తున్నట్లు పెషావర్ లోని జరిగిన భద్రతా సమావేశం అనంతరం పాకిస్థాన్ సైనిక ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ సలీమ్ బజ్వా వెల్లడించారు. అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వద్ద భద్రతపైనా సమావేశంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ సమీక్షించారు.
జమ్మూ కాశ్మీర్లో ఉరీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న జరిగిన దాడిలో 18 మంది సైనికులు మరణించినప్పటినుంచీ భారత్, పాకిస్థాన్ దౌత్య సంబంధాలమధ్య చీలిక ఏర్పడింది. ఉరీ ఘటనలో తమ ప్రమేయం ఉందన్న భారత్ ఆరోపణలను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రతిస్పందనను ఎదుర్కొనేందుకు సరిహద్దు నిర్వహణపై సాయుధ దళాల సమావేశంలో చర్చించినట్లు లెఫ్టినెంట్ జనరల్ బజ్వా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురయ్యే ప్రతి చర్యనూ ఎదుర్కొనేందుకు సరిహద్దుల్లో పర్యవేక్షణను ముమ్మరం చేసినట్లు తెలిపారు.