ఉగ్రవాదులపై పాక్ సైన్యం పంజా
- వైమానిక దాడులు, కాల్పుల్లో 60 మంది హతం
ఇస్లామాబాద్: వాయవ్య పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం దాడుల్లో దాదాపు 60మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ సైన్యం వైమానిక దాడులు జరపడంతోపాటు, ఆర్మీ చెక్‌పోస్టులపై జరిగిన దాడులను ప్రతిఘటించడం ద్వారా మిలిటెంట్లను మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. పాక్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దు సమీపంలోని ఒరాక్‌జాయ్ ఏజెన్సీ పరిధిలో షిందారా, ఖజానా కందావో ప్రాంతాల్లో ఉన్న ఆర్మీ చెక్‌పోస్టులపై శనివారం ఉదయం మిలిటెంట్లు దాడులకు పాల్పడినపుడు పాక్ సైన్యం దీటుగా ప్రతిఘటించింది.
సైన్యం జరిపిన కాల్పల్లో 20మంది మిలిటెంట్లు హతంకాగా, మరో 20మంది గాయపడ్డారు. కాల్పుల ఘర్షణలో కనీసం నలుగురు సైనికులు గాయపడ్డారు. దత్తాఖెల్ ప్రాంతంలో పాకిస్తాన్ యుద్ధవిమానాలు శుక్రవారం జరిపిన దాడుల్లో ఇద్దరు ఉగ్రవాద కమాండర్లు సహా 39 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ సందర్భంగా భూగర్భంలోని అమ్మోనియం డిపోను, స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్ మిలిటరీ ప్రతినిధి అసిమ్ బాజ్వా ట్వీటర్‌లో తెలిపారు.
కాగా, ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వందలాదిమందిని పాకిస్తాన్‌లో పలుచోట్లనుంచి అరెస్ట్ చేశారు. వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వ నమోదుచేయని మతపరమైన పాఠశాలలపై సైన్యం దాడిచేసి వాటి కి సీల్ వే సింది.
మిలిటెంట్లపై విచారణకు ముసాయిదా
ఉగ్రవాదులపై పోరుకు సంబంధించిన కార్యాచరణను పాకిస్తాన్ ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. కరుడుగట్టిన ఉగ్రవాదులు, శత్రు పోరాటయోధులపై విచారణకు వీలుగా రాజ్యాంగ, న్యాయపరమైన సవరణలతో రూపొందించిన తొలి ముసాయిదాను న్యాయనిపుణుల బృందం శనివారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సమర్పించింది. ఉగ్రవాద వ్యతిరేక సంస్థను తిరిగి క్రియాశీలకంగా మార్చాలని షరీఫ్ ఆదేశించారు. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఏర్పడిన పర్యవేక్షణ కమిటీ సమావేశానికి షరీఫ్ శనివారం అధ్యక్షత వహించారు.