పాకిస్థాన్: పెషావర్లో ఆర్మీ స్కూల్పై తీవ్రవాదులు సృష్టించిన నరమేధంతో పాక్ ప్రభుత్వం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందులోభాగంగా పాకిస్థాన్లోని గిరిజన ప్రాంతమైన ఖైబర్లోని తాలిబన్ స్థావరాలపై సైన్యం గురువారం ముకుమ్మడి దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 50 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ సైనిక అధికారులు వెల్లడించారు.
తాలిబన్ తీవ్రవాదుల ఆత్మాహుతి దళం సైనిక దుస్తుల్లో మంగళవారం పెషావర్ ఆర్మీ స్కూల్లో ప్రవేశించారు. పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దారుణంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను ఏరివేసేందుకు పాక్ ప్రభుత్వం నడుం బిగించింది.