ఇస్లామాబాద్: పాక్ - ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో యూఎస్, పాక్ దళాలు సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 14 మంది తీవ్రవాదులు మరణించారని పాక్ నిఘా ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. మృతి చెందిన తీవ్రవాదులను గుర్తించవలసి ఉందని తెలిపారు. దత్తకేల్ ప్రాంతంలో తీవ్రవాదులే లక్ష్యంగా జరిపిన దాడుల్లో 10 మంది మరణించారని... వారిలో నలుగురు విదేశీ తీవ్రవాదులున్నారని చెప్పారు. అలాగే తీవ్రవాదులకు చెందిన భారీ ఆయుధ సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని... ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. తాలిబన్ తీవ్రవాదులను అంతమొందించేందుకు ఉత్తర వజీరిస్థాన్లో పాకిస్థాన్ సైనిక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.