కర్ఫ్యూ తొలగిస్తే రక్తపాతమే | Pak PM Imran Khan threatens on Kashmir | Sakshi
Sakshi News home page

కర్ఫ్యూ తొలగిస్తే రక్తపాతమే

Published Sat, Sep 28 2019 2:56 AM | Last Updated on Sat, Sep 28 2019 11:31 AM

Pak PM Imran Khan threatens on Kashmir - Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్‌ మరోసారి భారత్‌పై బెదిరింపులకు దిగింది. భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కవ్విస్తూ... రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధమే వస్తే.. దాని విపరిణామాలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంతర్జాతీయ సమాజంపై బెదిరింపులకు దిగారు. భారత్‌ సొంత విషయమైన ఆర్టికల్‌ 370 రద్దును అంతర్జాతీయ వేదికపై లేవనెత్తుతూ.. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. కశ్మీర్లో అమానవీయంగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారని, దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. కశ్మీర్లో 9 లక్షల బలగాలను మోహరించారని, 80 లక్షల మంది స్థానికులపై తీవ్ర స్థాయి ఆంక్షలు విధించారని, 30 వేల మంది పిల్లలను గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించారని పేర్కొన్నారు.

భారత అనుకూల నేతలను కూడా నిర్బంధించారన్నారు. కర్ఫ్యూ తొలగించిన తరువాత ఏం జరుగుతుందో, భారత ప్రధాని మోదీ ఆలోచించారా? అక్కడ నెత్తుటేరులు పారకుండా ఉంటాయా? అంటూ హెచ్చరించారు. అహంకారం మోదీని గుడ్డివాడిని చేసిందని వ్యాఖ్యా నించారు. రక్తపాతమేమైనా జరిగితే.. అందుకు కూడా పాకిస్తాన్‌దే బాధ్య తని భారత్‌ అంటుందని ఇమ్రా న్‌ వ్యాఖ్యానించారు. ఇంత నిర్బంధాన్ని ఎదుర్కొన్న కశ్మీరీలు అతివాదులుగా ఎందుకు మారరో చెప్పాలన్నారు. కశ్మీర్లో నెలకొన్న అమాన వీయ పరిస్థితులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలన్నారు. ‘అంతర్జాతీయ సమాజం ఏం చేయబోతోంది? 120 కోట్ల ప్రజలున్న మార్కెట్‌(భారత్‌)ను సమర్ధిస్తుందా? లేక న్యాయం, మానవత్వం వైపు ఉంటుందా?’ తేలాలన్నారు. కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికారం లభించేలా చూడాల్సి ఉందన్నారు.

పుల్వామా సహా సరిహద్దుల్లో జరిగే ప్రతీ దాడికి పాకిస్తాన్‌ను బాధ్యులుగా చేయడం భారత్‌కు పరిపాటిగా మారిందన్నారు. పుల్వామా దాడి ఒక కశ్మీరీ యువకుడు చేసిన ఆత్మాహుతి దాడి అన్న ఇమ్రాన్‌..  దాన్ని కూడా పాక్‌పై నెట్టివేశారని, నిరూపిస్తూ చిన్న సాక్ష్యం కూడా చూపించలేకపోయారని ఆరోపించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా భారత్‌ ఐరాస తీర్మానాలు, సిమ్లా ఒప్పందం, భారత రాజ్యాంగం.. వీటన్నింటిని ఉల్లంఘించిందన్నారు. ఐరాస సమావేశాల్లో తొలిసారి పాల్గొన్న ఇమ్రాన్‌.. 15 నిమిషాల పరిమితిని దాటి 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇందులో సగం సమయాన్ని భారత్‌పై విషం కక్కేందుకు ఉపయోగించుకోగా.. మిగతా సమయంలో ఇస్లామోఫోబియా, మనీ లాండరింగ్‌ తదితర అంశాలను ప్రస్తావించారు. భారత ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ఇమ్రాన్‌ ప్రసంగించారు.  

ఇస్లామోఫోబియా
9/11 దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఇస్లామోఫోబియా (ఇస్లాం అంటే భయం) పెరిగిందని ఇమ్రాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది పాశ్చా త్య దేశాల నాయకులు ఇస్లాం, ఉగ్రవాదం ఒకటే అంటూ చేసిన ప్రచారం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఇస్లాం ఒకటేనని, ఈ ‘రాడికల్‌ ఇస్లాం’ అనేది ఏదీ లేదన్నారు. ఇస్లామోఫోబియాను తగ్గించేలా పాకిస్తాన్, టర్కీ, మలేసియాలు కలిసి ఇంగ్లీష్‌ టీవీ చానెల్‌ను ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. చివరగా భారత్‌లో పర్యటించడం తనకు ఇష్టమని ముక్తాయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement