ఇకపై నేర కథనాలను చూపకూడదు!
ఇస్లామాబాద్ః ఎలక్ట్రానిక్ మీడియాలో కాల్పనిక నేర వార్తలు, కథనాల ప్రసారానికి పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) అడ్డుకట్ట వేసింది. అత్యాచారాలు, హత్యలు, చోరీలు, ఆత్మహత్యల వంటి నేరాలను నాటక రూపంలో ప్రదర్శించడంపైనా నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది.
శుక్రవారం జరిగిన పెమ్రా సదస్సులో ప్రసంగించిన ఛైర్మన్ అబ్సర్ ఆలం... ఆత్మహత్యలు, హత్యలు వంటి నేరాలను ప్రత్యేక షోలుగా ప్రసారం చేయడం, నాటక రూపంలో ప్రదర్శించడాన్ని నిషేధించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాక పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో రైడ్ ప్రాంతాలను కూడ చూపించకూడదన్న నిబంధనను వచ్చే నెలనుంచి విధించనున్నట్లు తెలిపారు. ఛానెల్స్ ప్రసారం చేసే అత్యాచారం, ఆత్మహత్యల కేసుల్లో బాధిత కుటుంబాలకు సబంధించిన సభ్యుల పేర్లను ప్రస్తావించకూడదని, ప్రత్యేక ఇంటర్వ్యూలను కూడ ప్రసారం చేయకూడదని పెమ్రా ఛైర్మన్ తెలిపారు. అటువంటి ప్రదర్శనలు, కార్యక్రమాలపై వీక్షకులు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నారని, ఆ కథనాల వల్ల యువత వ్యూహాత్మకంగా కొత్త తరహా నేరాలకు పాల్పడటం నేర్చుకుంటున్నారన్న అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
స్టాండింగ్ సెనేట్ కమిటీలు వేసిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా నేరాలను తిరిగి చూపడం నిషేధించాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. టీవీ షోల్లో నేర కథనాల ప్రసారం విషయంలో పంజాబ్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడ ఆమోదించినట్లు తెలిపింది. ప్రస్తుతం పరిశోధనాత్మక జర్నలిజంపై కూడ దృష్టి పెట్టామని, దానికి సంబంధించిన నియమ నిబంధనలతో త్వరలో ఛానెల్స్ కు నోటిఫికేషన్ అందించనున్నట్లు పెమ్రా తెలిపింది.