భారత డ్రోన్‌ను కూల్చాం: పాక్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ దాటి తమ భూభాగంలోకి చొరబడిన భారత డ్రోన్‌ను నేలకూల్చామని పాకిస్థాన్ సైన్యం శనివారం ప్రకటించింది. ‘పాక్ భూభాగంలోకి ప్రవేశించిన భారత క్వాడ్‌కాప్టర్‌ను పాక్ దళాలు శనివారం సాయంత్రం కుప్పకూల్చాయి. దాని శకలాలు రాక్‌చక్రి సెక్టార్‌లోని అగాయ్ పోస్టు సమీపంలో పడ్డాయి’ అని పాక్ ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సర్జికల్ దాడుల తరువాత ఇరు దేశాల సరిహద్దుల్లో పాక్ 286 సార్లు షెల్లింగ్, మోర్టార్‌లతో కాల్పులకు పాల్పడటంతో 14 మంది భద్రతా సిబ్బంది సహా 26 మంది ప్రజలు చనిపోయారు.
భారత్‌కే ఎక్కువ నష్టం జరిగింది: పాక్ అత్యున్నత కమాండర్
గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో భారత సైనికులే ఎక్కువ మంది చనిపోయారని పాక్ 10 కారప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మాలిక్ జఫార్ ఇక్బాల్ అన్నారు. పాక్ సైనికులు 20 మంది చనిపోగా భారత్ వైపు కనీసం 40 మంది మరణించారని తెలిపారు. ప్రజాగ్రహానికి భయపడే భారత్ ఈ సంఖ్యను తగ్గించి చూపుతోందని ఆరోపించారు.