
ఉడీ దాడి కుట్ర భారతదేశానిదే: పాక్
పాకిస్థాన్ సరికొత్త వాదన మొదలుపెట్టింది. జమ్ము కశ్మీర్‌లోని ఉడీ పట్టణంలో భారత ఆర్మీ శిబిరంపై దాడి చేసి 19 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నది పాక్ వాళ్లు కారట.. భారతదేశమే దానికి కుట్రపన్ని మరీ ఆ పనిచేసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంటున్నారు. సెప్టెంబర్ 18 నాటి ఆ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పేరును కావాలనే వాళ్లు ప్రస్తావిస్తున్నారని, నిజానికి ఆ కుట్ర భారతదేశమే రచించిందని ఆరోపించారు.
పాకిస్థాన్‌లో తయారైన మందులు, అక్కడే కొన్నట్లుగా రుజువైన రెడ్‌బుల్ క్యాన్లు వీటన్నింటినీ చూపించడమే కాక పాకిస్థాన్ రాయబారిని స్వయంగా పిలిపించి ఆ ఆధారాలను కూడా భారత్ ఆయనకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా, ఉడీ దాడిపై అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఇలాంటి పనికిమాలిన ఆరోపణలకు దిగింది. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ అమెరికన్ కాంగ్రెస్‌లో ఒక బిల్లు కూడా చర్చలో ఉందన్న విషయాన్ని ఖ్వాజా ఆసిఫ్ వద్ద ప్రస్తావించగా.. నాలుగైదు గొంతుకలు లేచినంత మాత్రాన పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం సాధ్యం కాదని చెప్పారు.