పాక్ నుంచి 350 మంది భారత జాలర్లకు విముక్తి
ఇస్లామాబాద్: అక్రమంగా పాక్ జలాల్లోకి ప్రవేశించి జైలు పాలైన 350 మంది భారత జాలర్లను విడుదల చేయాలంటూ ఇస్లామాబాద్ కోర్టు తీర్పిచ్చింది. జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ మాలిర్ సల్మాన్ అంజిద్ సిద్ధిఖీ ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీచేశారు. భారత జాలర్లు ఇప్పటికే 8 నెలల జైలు శిక్ష అనుభవించారని, వారు చేసిన నేరానికి ఆ శిక్ష సరిపోతుందన్నారు. వెంటనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు.
ఇరుదేశాలకు చెందిన జాలర్లు పొరపాటున పొరుగుదేశ జలాల్లోకి ప్రవేశించి అరెస్ట్ కావడం గత కొంతకాలం నుంచి చర్చనీయాంశమైంది. అరేబియా సముద్రంలో ఏ దేశానికి ఎంతమేరకు జలసరిహద్దు ఉందో కచ్చితమైన సమాచారం లేకపోవడంతోనే వందల సంఖ్యలో జాలర్లు ఇలా పొరుగు దేశంలో జైలు పాలు కావాల్సి వస్తుందని పాక్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.