ట్రంప్‌ షాక్‌తో.. పాక్‌ గిలగిల | Pakistan Foreign Minister meets PM after Donald Trump remarks  | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ షాక్‌తో.. పాక్‌ గిలగిల

Published Tue, Jan 2 2018 9:54 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Pakistan Foreign Minister meets PM after Donald Trump remarks  - Sakshi

ఇస్లామాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇచ్చిన ఊహించని షాక్‌తో పాకిస్తాన్‌ విలవిల్లాడుతోంది. సహాయ నిధులను నిలిపేయడంతో పాటు ఉగ్రవాదుల విషయంలో అబద్దాలు చెబుతున్నారంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీతో విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు ట్రంప్‌ ట్వీట్‌ మీద, ఇకముందు అనుసరించాల్సిన విదేశాంగ విధానం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ట్రంప్‌ ట్వీట్‌పై త్వరలో స్పందిస్తామని, ప్రపంచానికి నిజాలు తెలుసని ట్విటర్‌లో ఖ్వాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. వాస్తవాలకు కల్పితాలకు ఉన్న తేడాను ప్రపంచం గుర్తిస్తుందన్న నమ్మకాన్ని ఆసిఫ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుండగా.. అమెరికా కోరుకుంటున్న ‘డూ మోర్‌’ పాలసీని పాకిస్తాన్‌ ఇదివరకే తిరస్కరించినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌కు స్పష్టం చేసినట్లు కూడా చెప్పారు. ‘డూ మోర్‌’ అనే పదానికి ప్రాముఖ్యత లేదన్నారు. గత 15 ఏళ్లుగా అమెరికా అందించిన సాయంపై పూర్తి వివరాలను ఖర్చులతో సహా వివరించేందుకు పాకిస్తాన్‌ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. 

ట్రంప్‌ ట్వీట్‌పై పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ సెనేటర్‌ షెర్రీ రెహమాన్‌ తీవ్రంగా స్పం‍దించారు. సంకీర్ణ భాగస్వామ్యంలో ఇచ్చిన నిధులకు జమాఖర్చులు అడగడం పాకిస్తాన్‌ను అవమానిండమేనని అన్నారు. పాకిస్తాన్‌ సహాయ సహకారాలు లేకుండా ఆఫ్ఘన్‌తో నాటో దళాలు యుద్ధం చేసేవా? అని ఆయన ప్రశ్నించారు. 

అమెరికన్‌ రాయబారికి సమన్లు
ట్రంప్‌ ట్వీట్‌పై వివరణ ఇవ్వాలంటూ పాకిస్తాన్‌లోని అమెరికా రాయబారి డేవిడ్‌ హాలేకి ఆ దేశం సోమవారం రాత్రి సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్‌ సమన్లు జారీ చేసిన విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి తెహమీనియా జుంజువా ఈ సమన్లు పంపినట్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement