ఇస్లామాబాద్ : మేం తల్చుకుంటే భారత్‌లో ఒక్క నగరం మిగలదు.. ఢిల్లీ సహా పలు నగరాలను నేల మట్టం చేస్తాం.. మా అణు శక్తిని తట్టుకోలేరు అంటూ భారత్‌ను పాకిస్తాన్ హెచ్చరించింది. అలాగే ఐఎస్‌ఐతో ఉగ్రవాదులకు సంబంధాలున్నాయన్న అమెరికా ప్రకటనపైనా స్పందించింది. అమెరికాలోని గన్ లాబీయిస్టులకే ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పాక్ వ్యాఖ్యానించింది. ‘భారత ప్రభుత్వం ఆదేశిస్తే.. ఏకకాలంలో చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధం చేయగలమని.. అవసరం అయితే పాకిస్తాన్‌లోని అణ్వాయుధ స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని’ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా ప్రకటనపై పాక్ ప్రతిస్పందించింది.
మేం తల్చుకుంటే భారత్‌లోని ఏ నగరాన్ని అయినా నేలమట్టం చేయగలని పాకిస్తాన్ విదేశాంగ శాఖమంత్రి ఖ్వాజా ఆసిఫ్ శుక్రవారం ప్రకటించారు. అంతేకాక మా అణుశక్తిని తట్టుకుని భారత్ నిలబడలేదని హెచ్చరించారు. సరిహద్దునుంచి లక్ష్యం నిర్ణయించి మా అణ్వాయుధాలను వదిలితే.. క్షణాల్లో ఢిల్లీ సహా పలు నగరాలు నేలమట్టం అవుతాయని ఆయన అన్నారు. ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. శక్తివంతమైన అణ్వాయుధాలు కలిగిన దేశాల్లో పాక్ ఒకటని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలను ఆసిఫ్ ఖండించారు. అసలు అమెరికాలోని గన్ లాబీసంస్థలకే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని చెప్పారు. ఇందుకు లాస్‌వేగాస్ ఘటనే నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి గన్ లాబీనే కారణమని ఆసిఫ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment