
పాకిస్తాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ వరకు ఈ కారిడార్ ఉంది.
లాహోర్ : కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభించనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. పాకిస్తాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ వరకు ఈ కారిడార్ ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ సరిహద్దు నుంచి డేరాబాబా నానక్ వరకు కారిడార్ నిర్మాణానికి భారత్ సంకల్పించింది. అటువైపు దార్బర్ సాహిబ్ వరకు కారిడార్‌ను పాక్ చేపట్టింది. అయితే పాక్ వైపు కారిడార్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో.. దీనిని ప్రారంభించేందకు ఆ దేశ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కారిడార్ ప్రారంభంతో భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లవచ్చు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించినున్నట్టు ఇమ్రాన్ చెప్పారు. ఈ కారిడార్‌ను ప్రారంభించడం వల్ల స్థానికులకు ఆతిథ్య రంగంలో ఉపాధి లభిస్తోందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు కర్తార్‌పూర్ కారిడార్‌కు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇప్పటికే మొదలైనప్పటికీ.. సందర్శనకు వచ్చే భక్తుల నుంచి పెద్దమొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని పాక్ నిర్ణయించింది. ఒక్కో భక్తుడు 20 యూఎస్ డాలర్లు చెల్లించాలని పేర్కొంది. ఈ అంశంపై భారత్ కొన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ పాక్ వాటిని తోసిపుచ్చింది. దీంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం కానుంది. కాగా, ఈ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కానున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి తెలిపారు.
16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. గురునానక్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వార పాకిస్తాన్‌కు వెళ్లింది.