
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యంపై ఆ దేశానికి రాజకీయ మహిళా నేత కుమార్తె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సైన్యం వ్యవహారశైలిని తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో పాకిస్తాన్‌లో పెద్ద దుమారమే రేపింది. నాటకీయ పరిణామాల తర్వాత ఆమె ట్విటర్ ఖాతా మాయమయిందని పాక్ మీడియా వెల్లడించింది.
తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) నాయకుడు షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ మజారీ ఈ వీడియో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఫైజాబాద్‌లో సైన్యం వ్యవహరించిన తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆర్మీ చాలా అవమానకరంగా ప్రవర్తించిందని దుయ్యబట్టారని పాకిస్తాన్ టుడే పత్రిక తెలిపింది. ఈ వీడియోను ట్విటర్ నుంచి తొలగించడానికంటే ముందు పాకిస్తాన్‌లో చాలా మంది వీక్షించారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ వీడియో వైరల్‌గా మారడంతో తన కుమార్తె వ్యాఖ్యలను ఖండిస్తూ ఇమాన్ తల్లి షిరీన్ మజారీ ట్వీట్ చేశారు. సైన్యానికి వ్యతిరేకంగా ఆమె వాడిన బాషను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇమాన్ అంటే తనకు ప్రేమ ఉందని, సైన్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. సొంత అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు తన కూతురికి ఉన్నట్టే, ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించే హక్కు తనకూ ఉందన్నారు.
నవంబర్ 25న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసు మరణించగా, 150 మంది గాయపడ్డారు. ఇస్లామాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించిన వేలాది మందిని చెదరగొట్టేందుకు పోలీసులు, పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో ఈ హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో సైన్యం తీరును తప్పుబడుతూ ఇమాన్ మజారీ తన ఆవేదనను వీడియో రూపంలో వ్యక్తపరిచారు. ఇమాన్ మజారీ ట్విటర్ నుంచి తనంత తానుగా వైదొలగారా, లేక బలవంతంగా ఆమె ఖాతాను తొలగించారా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment