ఇస్లామాబాద్ : భారత్ తమ దౌత్యవేత్తలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్న పాకిస్తాన్ తాజాగా భారత్‌లో తమ హైకమిషనర్‌ను వెనక్కి పిలిపించింది. భారత్ తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలో పాక్ హైకమిషనర్ సొహైల్ మహ్మద్‌ను రీకాల్ చేసింది. విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మహ్మద్ ఫైసల్ గురువారం వెల్లడించారు. తమ దౌత్యవేత్తలను భారత్ వేధింపులకు గురిచేస్తుండటంపై హైకమిషనర్‌తో పాకిస్తాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు.
భారత్‌లో పాక్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై భారత డిప్యూటీ హైకమిషనర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. మరోవైపు న్యూఢిల్లీలో పాకిస్తాన్ దౌత్య సిబ్బంది..వారి కుటుంబాలపై వేధింపులు, దాడులు తీవ్రతరమయ్యాయని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
గత వారం న్యూఢిల్లీలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ కారును కొందరు వెంటాడి, డ్రైవర్‌ను వేధించారని తెలిపింది. పాక్ ఫిర్యాదులపై స్పందించిన భారత్ స్నేహపూర్వక వాతావరణంలో దౌత్యవేత్తలు పనిచేసుకునేలా అన్ని చర్యలూ చేపడతామని హామీ ఇచ్చింది. గత ఏడాది పాక్‌లో భారత అధికారులు సైతం వేధింపులకు గురయ్యారని దౌత్యపరమైన పద్ధతుల్లో వీటిని వారు పరిష్కరించుకున్నారని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment