
ఇస్లామాబాద్ : ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం భారత తదుపరి ప్రధాని అవుతారని ఓ పాకిస్తాన్ నేత జోస్యం చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారని పాక్ సెనేటర్, మాజీ దేశీయాంగ మంత్రి రెహమాన్ మాలిక్ వ్యాఖ్యానించారు. చిదంబరం అరెస్ట్‌ను కశ్మీర్ అంశంతో ఆయన ముడిపెట్టడం గమనార్హం. అణిచివేతకు గురైన కశ్మీరీల తరపున మాట్లాడినందుకే చిదంబరంను వేధిస్తున్నారని మాలిక్ చెప్పుకొచ్చారు. చిదంబరం తదుపరి భారత ప్రధాని అని..ఆయన ఎంతో సామర్ధ్యం కలిగిన రాజకీయ నేతని మాలిక్ కొనియాడటం విశేషం.
ఆర్టికల్ 370, 35 ఏ రద్దు నిర్ణయంపై మోదీ సర్కార్‌ను ప్రశ్నించడమే చిదంబరం చేసిన తప్పని పాక్ పత్రిక ది నేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ పేర్కొన్నారు. కశ్మీర్‌లో ముస్లింల ఊచకోతకు ప్రధాని నరేంద్ర మోదీ ఆరెస్సెస్‌కు స్వేచ్ఛ ఇచ్చారని ఆరోపించారు. కాగా మాలిక్ గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత భావిప్రధానిగా రాహుల్ గాంధీ అని అభివర్ణించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికరవగా, అమేథి నియోజకవర్గంలో స్వయంగా రాహుల్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పోటీచేసిన రాహుల్ అక్కడి నుంచి గెలుపొంది పరువు నిలుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment