
న్యూయార్క్ : పాకిస్థాన్ విషయంలో అమెరికా మరోసారి తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. నిన్నమొన్నటి వరకు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఇదే ఆఖరి అవకాశం అంటూ వార్నింగ్ ఇచ్చిన అమెరికా తాజాగా మాట మార్చింది. పాకిస్థాన్‌ను పొగడ్తల్లో ముంచెత్తింది. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న తమవారిని బయటపడేసేందుకు పాకిస్థాన్ ఎంతో సాయం చేసిందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు. కెనడియన్-అమెరికా కుటుంబానికి చెందిన జోషువా బోలే అతడి భార్య ముగ్గురు సంతానం ఇటీవలె హక్కాని నెట్‌వర్క్ ఉగ్రవాదుల చేతుల్లో నుంచి బయటపడ్డారు.
ఐదేళ్ల కిందట ఆ కుటుంబం కిడ్నాప్ అయింది. అయితే, తాజాగా వారిని పాకిస్థాన్ బలగాలు విడిపించాయి. దీంతో తమ దేశీయులకు ఎలాంటి హానీ జరగకుండా విడిపించినందుకు పెన్స్ పాక్ ను కొనియాడారు. వాస్తవానికి గతంలోనే వారిని విడిచిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ పాక్ నిర్లక్ష్యం చేసింది. అయితే, ఇటీవలె పాక్ ఉగ్రవాద దేశం అని, ఆదేశానికి ఇదే చివరి హెచ్చరిక అంటూ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్థాన్ కావాలనే రియాక్ట్ అయి అమెరికాను ఆకట్టుకునేందుకే వారి పౌరులను విడిపించిందని సమాచారం.