ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మరోమారు పేచీకి దిగింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా కఠినమైన చర్యలు చేపట్టాలంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకుండానే వితండవాదం చేస్తోంది. ఎఫ్‌ఏటీఎప్ లక్ష్యాల్ని చేరుకోవడానికి 15 నెలలుగా మిన్నకుండిపోయిన పాక్ మరో నాలుగు నెలల కాలంలో అద్భుతాలు చేస్తామంటూ గొప్పలు చెప్తోంది. బ్లాక్ లిస్టులో చేరుకుండా చైనా అండతో తప్పించుకోవాలని చూస్తోంది.
తను నిర్దేశించిన లక్ష్యాల్ని పాక్ చేరుకోలేదని ఎఫ్‌ఏటీఎఫ్ ఇటీవల స్పష్టం చేసింది.15 నెలల కాలంలో 27 లక్ష్యాల్ని తాము నిర్దేశించగా.. పాక్ ఆ దిశగా సరైన పనితీరును కనబర్చలేదని వెల్లడించింది. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చడం ఖాయమని పారిస్ కేంద్రంగా పనిచేసే ఎఫ్‌ఏటీఎఫ్ పేర్కొంది. ఇక 2018, జూన్ నెలలో పాక్‌ను ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చిన విషయం తెలిసిందే. 2020 ఫిబ్రవరి వరకు ఉగ్ర నిర్మూలనకు ఉద్దేశించిన లక్ష్యాల్ని చేరుకోని పక్షంలో గ్రే నుంచి బ్లాక్‌లిస్టులో పెడతామంటూ అప్పుడే తేల్చి చెప్పింది.
బ్లాక్ లిస్టులో పెడితే..
ఎఫ్‌ఏటీఎఫ్‌లో 39 సభ్య దేశాలున్నాయి. విశ్వవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాలను నిర్మూలించడం.. ఉగ్రవాదులకు మనీలాండరింగ్ మార్గాల ద్వారా నిధులు అందకుండా చేయడం వంటి అంశాల ప్రాతిపదికన ఎఫ్‌ఏటీఎఫ్ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఎఫ్‌ఏటీఎఫ్ ఆ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చింది. పలు లక్ష్యాల్ని నిర్దేశించింది. పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చితే.. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు ఇవ్వడానికి విదేశీ సంస్థలు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ రుణాలు ముందుకురావు. అసలే అంతంతం మాత్రంగా ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ చర్య శరాఘాతం అవుతుంది.
(చదవండి : మోదీ-జిన్‌పింగ్ భేటీ: కశ్మీర్‌పై కీలక ప్రకటన)
ఇక పాక్‌ను బ్లాక్ లిస్టులో చేర్చితేనే ఫలితం ఉంటుందని, ఉగ్రచర్యలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని భారత్, అమెరికా భావిస్తున్నాయి. పాకిస్తాన్‌ను ఇదివరకే బ్లాక్‌లిస్టులో చేర్చే అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చైనా అండదండలతో పాక్ తప్పించుకుంది. ఎఫ్‌ఏటీఎఫ్ ప్రెసిడెంట్‌గా చైనా వ్యక్తి ఉండటమే దీనికి కారణం. మరోవైపు ఎఫ్‌టీఏఎప్‌లో పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో చేర్చడానికి భారత్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని తమిళనాడులో ఇటీవల జరిపిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టుగా పలు విశ్లేషణలు చెప్తున్నాయి. మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి హమాద్ అజార్ మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశం ఉగ్ర నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటోందని, ఎఫ్‌ఏటీఫ్ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఏటీఎఫ్ 27 లక్ష్యాల్లో 20 సాధించామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment