
ఆ దారుణ వీడియోలోని వ్యక్తి అరెస్ట్
ఇస్లామాబాద్: ఇటీవల సోషల్ మీడియాలో ఓ ట్రాన్స్జెండర్ మహిళపై విచక్షణారహితంగ దాడి చేసిన దృశ్యాలు బాగా ప్రచారమయ్యాయి. వీడియో వైరల్గా మారడంతో ఈ అమానుష ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. దాడి చేసిన వ్యక్తితో పాటు అతడితో ఉన్న మరికొందరిపై కేసు నమోదు చేశారు.
పాకిస్తాన్లోని సియల్కోట్లో జరిగిన ఈ ఘటనలో ట్రాన్స్జెండర్ మహిళపై జజ్జా బట్ అనే వ్యక్తి బెల్టుతో తీవ్రంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి బట్ను ఆపి పక్కకు తీసుకెళ్లినప్పటికీ.. ఆగ్రహంతో ఊగిపోతూ బట్ మళ్లీ దాడిచేశాడు. ఫోన్లో చిత్రీకరించిన దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. స్థానికంగా ఓ ముఠా ట్రాన్స్జెండర్ మహిళలను లక్ష్యంగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ మేరకు వారిపై కేసునమోదు చేశారు.
ఈ ఘటనపై మరో ట్రాన్స్జెండర్ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. తాము చాలా కాలంగా దోపిడీకి గురవుతున్నామని వెల్లడించింది. ఈ వీడియో వైరల్ కావడం మంచిదే అని, తమపై జరుగుతున్న దాడులు ఇలా అయినా ప్రపంచానికి తెలిసినందుకు సంతోషమని ఆమె తెలిపింది.