
మలాలాకు చిన్నారుల నోబెల్
ప్రతిష్టాత్మక ప్రపంచ చిన్నారుల అవార్డుకు ఎంపిక
లండన్: చిన్నారుల నోబెల్‌గా పేర్కొనే ‘ప్రపంచ చిన్నారుల అవార్డు’కు పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్(16) ఎంపికయ్యింది. మరో ఇద్దరు ప్రముఖులు.. అమెరికాకు చెందిన జాన్ వుడ్, నేపాల్‌కు చెందిన రణంగర్ కూడా 2014 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. ఏటా 15 మంది చిన్నారులతో కూడిన అవార్డుల జ్యూరీ ముగ్గురి పేర్లను ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తుంది. వారికి స్వీడన్ సంస్థ అవార్డును ప్రదానం చేస్తుంది.
బాలికల విద్యా హక్కు కోసం ధైర్యంగా, సాహసోపేతంగా పోరాడినందుకు మలాలా పేరును ప్రతిపాదించినట్లు అవార్డుల జ్యూరీ పేర్కొంది. పాక్‌లోని స్వాత్‌లోయలో బాలికలు చదువుకోవడాన్ని తాలిబాన్లు నిషేధించినా, 11 ఏళ్ల వయసులోనే మలాలా విద్యా హక్కు కోసం నినదించిందని తెలిపింది. తాలిబాన్ల ఆదేశాలను ధిక్కరించి మలాలా ధైర్యంగా స్కూలుకెళ్లి.. 15 ఏళ్ల వయసులో(2012లో) కాల్పులకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వివరించింది. మలాలాపై హత్యాయత్నం ద్వారా తాలిబాన్లు ఆమె పోరాటాన్ని ప్రపంచవ్యాప్తం చేశారని పేర్కొంది. ప్రస్తుతం మలాలా బ్రిటన్‌లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అవార్డుకు ఎంపికైన మరో ఇద్దరిలో అమరికాకు చెందిన జాన్‌వుడ్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వదులుకుని.. ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల విద్య కోసం 15 ఏళ్లుగా పాటుపడుతున్నారు. ఇక నేపాల్‌కు చెందిన రణంగర్ స్వదేశంలో చిన్నారుల హక్కుల కోసం 20 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు.