ఆకాశంలో పెంట్‌హౌస్..!
ఒక గదిలో 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ.. అత్యంత ఖరీదైన సోఫా.. అందులో బంగారు కుషన్లు, మరో గదిలో డబుల్ బెడ్.. అటాచ్‌డ్ బాత్‌రూమ్, సమస్త సౌకర్యాలతో కూడిన ఓ డైనింగ్ రూమ్.. మొత్తం మూడు గదులున్న ప్రైవేటు సూట్. ఇదంతా ఏదో హోటల్ గురించి అనుకుంటున్నారా? లగ్జరీ హోటల్‌లో ఇలాంటివి కామనే. కానీ ఇవే సౌకర్యాలు ఓ విమానంలో ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ! అలాంటి అద్భుతాన్ని ‘ఇత్తిహాద్’ ఎయిర్‌లైన్స్ సంస్థ సాకారం చేసింది.
ప్రపంచంలోనే తొలి ఎగిరే ‘పెంట్‌హౌస్’ను తన ప్రయాణికుల కోసం తీసుకొచ్చింది. ఏ380 ఎయిర్‌బస్‌లోని అప్పర్ డెక్‌లో 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘ది రెసిడెన్స్’ పేరుతో ఓ పెంట్‌హౌస్ ఏర్పాటుచేసింది. ఈ విమానం ఈనెల 27 నుంచి అబుదాబీ, లండన్ మధ్య రాకపోకలు సాగించనుంది. ఈ రెసిడెన్స్‌లో ఒకవైపు సింగిల్ లేదా డబుల్ ఆక్యుపెన్సీ చార్జీని 12,500 పౌండ్లుగా (దాదాపు రూ. 12.40 లక్షలు) నిర్ధారించారు. ఇంత రేటున్నా, అప్పుడే ఈ టికెట్లన్నీ అమ్ముడుపోయాయట.