వాషింగ్టన్ : కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా పలు కార్యక్రమాలు వాయిదా పడటమో, రద్దు కావడమో జరిగింది. ఈ క్రమంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న అగ్రరాజ్యంలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు కూడా వాయిదా పడతాయనే వార్తలు వచ్చాయి. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాటిని ఖండించారు. అయితే ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. ఓటింగ్‌పై కరోనా ప్రభావం ఉండనుందని ఇటీవలి ప్యూ రీసెర్చి సర్వేలో వెల్లడైంది. దాదాపు మూడింట రెండొంతుల అమెరికన్లు కరోనా సంక్షోభం నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలిపింది.
ఈ సర్వే కోసం ఏప్రిల్ 7 నుంచి 12 వరకు 4,917 మంది అమెరికన్ల అభిప్రాయం తీసుకున్నట్టు ప్యూ రీసెర్చి పేర్కొంది. అందులో 67 శాతం అమెరికన్లు చాలా వరకు కరోనా అధ్యక్ష ఎన్నికల్లో.. ప్రజలు ఓటు వేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ చాలా మంది అమెరికన్లు నవంబర్‌లోనే ఈ ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ డెమోక్రట్స్‌లో 46 శాతం మాత్రం నవంబర్‌లో ఎన్నికలు న్యాయంగా జరుగుతాయనే దానిపై తక్కువ విశ్వాసం వెలిబుచ్చారు. కాగా, ఈ సర్వేలో మొయిల్ ద్వారా ఓటింగ్‌ను సమర్థిస్తారా అని ప్రశ్నించగా.. 70 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. అలాగే అన్ని రకాల ఎన్నికలకు కూడా మెయిల్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని సగానికి పైగా అమెరికన్లు మొగ్గు చూపుతున్నారని ‘ప్యూ’ సర్వే వెల్లడించింది.
కాగా, నవంబర్ 3న జరగనున్న ఎన్నికలను ట్రంప్ వాయిదా వేయాలని చూస్తున్నారని డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల తేదీ మార్చాలనే ఆలోచన తనకు లేదని ట్రంప్ పేర్కొన్నారు.
చదవండి : అమెరికాలో హెచ్ 1 బీ టెన్షన్...
Comments
Please login to add a commentAdd a comment