చిన్నారితో అపోలో వైద్య బృందం
హైదరాబాద్: రియాద్ నుంచి మనీలా వెళ్తున్న ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఫిలిప్పీన్స్ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. నొప్పులు తీవ్రమవడంతో.. మహిళ పరిస్థితిని గమనించిన పైలట్ ఆ సమయంలో సమీపంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి తెలిపారు. అప్రమత్తమైన వైద్యులు విమానం ల్యాండ్ అవ్వకముందే విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానం ల్యాండ్ అయిన మరుక్షణ మే ఆమె కూర్చున్న సీటు వద్దనే మహిళకు సాధారణ కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భద్రతా కారణాలతో విమానంలోకి సర్జికల్ బ్లేడ్లకు అనుమతి లేకపోవడంతో బొడ్డు తాడును వేరుచేయలేకపోయారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పి.సురేష్‌కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం తల్లి, బిడ్డలకు చికిత్స అందించింది. ఈ ఘటన ఈ నెల 8న చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు అపోలో వైద్యులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment