మహిళను ముద్దాడుతున్న రొడ్రిగో
మనీలా/సియోల్: ఫిలిప్పీన్స్‌లో నిరంకుశ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ మహిళను 3 వేల మంది సమక్షంలో బహిరంగంగా పెదాలపై ఆయన ముద్దాడటమే ఇందుకు కారణం. స్ర్తీద్వేషిగా వార్తల్లో నిలిచే రొడ్రిగో చేసిన పనితో జనాలంతా దిగ్భ్రాంతికి గురికాగా, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
తాజాగా ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించారు. ఈ ఆదివారం అక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న ప్రజల్లో ఓ ఫిలిపైనో మహిళను వేదిక మీదకు పిలిచారు. ఆమెకు ఓ పుస్తకాన్ని బహుకరించి అనంతరం తన పెదాలను ముద్దు పెట్టుకోవాల్సిందిగా ఆమెను కోరారు. ‘మీరు ఒంటరినా? లేక వివాహం అయ్యిందా? పుస్తకం బదులు నా పెదాలను ముద్దాడండి అని రొడ్రిగో అడగ్గా.. దానికి ఆమె అయ్యిందనే బదులిచ్చారు. ‘అయినప్పటికీ ముద్దు పెట్టాల్సిందేనంటూ’ ఆమెను ఆయన ప్రాధేయపడ్డాడు. మొహమాట పడుతూనే ఆమె రొడ్రిగో పెదాలను ఛుంబించటంతో అక్కడున్న జనమంతా నిశ్చేష్టులయ్యారు. అయితే ఆ వెంటనే ఆయన ‘ఇది సరదా కోసం చేసిందే. సీరియస్‌గా తీసుకోకండని’ అంటూ అక్కడున్న వారిని కోరారు.
విమర్శలు-జోకులు... 73 ఏళ్ల డ్యుటెర్టె గతంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కార్యక్రమానికి హాజరైన ప్రజలను వినోదపరిచేందుకు తాను అలా చేశానని ఆయన స్పష్టం చేసినప్పటికీ, ఫిలిప్పీన్స్‌లోని మహిళా సంఘాలు, రాజకీయ నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. సరదా కోసం ఓ మహిళను ఇబ్బంది పెట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరికొందరు ‘అది తప్పు అని, అంతలా అయితే చెంపపై పెట్టాల్సింది’ అని అంటున్నారు. విమర్శలు తారాస్థాయికి చేరటంతో మనీలాకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఆ మహిళను ఇంటర్వ్యూ చేశాయి. ఇది చాలా చిన్న వ్యవహారమని, తనకు, తన భర్తకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు వస్తుందో తెలీటం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. మరికొందరు రొడ్రిగోకు మద్ధతుగా ట్వీట్లు చేస్తుండగా, ఇంకొందరు మాత్రం మహిళ స్థానంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ను అంటించి(మార్ఫింగ్) సరదా కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment