కాబూల్: నెత్తుటి మరకలతో అప్ఘనిస్థాన్ రోదించింది. సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 42 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో పది మంది విలేకరులు కూడా ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్ అహ్మద్ షా మరణించారు. కాబూల్ మృతుల్లో ఏఎఫ్‌పీ చీఫ్ ఫొటోగ్రాఫర్ షా మరై కూడా ఉన్నారు.
షా మరై గురించి... వాస్తవాలను ధైర్యంగా వెలుగులోకి తెచ్చిన వ్యక్తి. అధికార మార్పిడి, అంతర్యుద్ధంతో సతమతమైన అఫ్ఘన్ చీకటి గతాన్ని రెండు దశాబ్దాలకు పైగా తన కెమెరాలో బంధించారు. ఉత్తర కాబూల్ షమాలి ప్రాంతానికి చెందిన షా మరై తర్వాత కాబూల్‌కు వలస వెళ్లారు. 1996లో ఏఎఫ్‌పీ వార్తా సంస్థలో ఓ డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని ఆయన మొదలుపెట్టారు. అరుదైన ఫోటోలను తాను పని చేసే సంస్థకు అందించి ఫోటోగ్రాఫర్‌గా మారిపోయారు. ముఖ్యంగా 2001లో అమెరికా సైన్యం అప్ఘనిస్థాన్‌పై విరుచుకుపడ్డప్పుడు ఆయన ఇచ్చిన ఫోటోలు ప్రపంచాన్ని కదిలించాయి. ఆయన టాలెంట్‌ను గుర్తించిన ఏఎఫ్‌పీ..ఆ మరుసటి సంవత్సరమే ఫోటో స్ట్రింగర్‌గా ఆయన్ని నియమించింది. ఆపై చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా ఆయన పదొన్నతి పొందారు.
యుద్ధం అంటే ఇలా ఉంటుందా? ఫోటోల కోసం ఆయన చాలా శ్రమించేవారు. కొన్ని నెలలపాటు ఆయన కుటుంబానికి దూరంగా ఉండేవారు. ఎత్తైన కొండలు, గుహలను దాటుకుని.. ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఆయన ప్రయాణించేవారు. ఆయన మూలంగానే అఫ్ఘన్‌లో యుద్ధ పరిస్థితులు ప్రపంచానికి తెలిశాయి. విస్మయపరిచే కోణాల్లో ఆయన తీసిన ఫోటోలు ‘యుద్ధం అంటే ఇలా ఉంటుందా?’ అన్న భావన కలిగించేవి. ఫోటోగ్రఫీని ఓ వృత్తి.. ప్రవృత్తిలా కాకుండా.. ఓవైపు ఉగ్ర కోరలు, మరోవైపు సంయుక్త సైన్యాల దాడులతో నలిగిపోతున్న ప్రజా జీవితాన్ని సమాజానికి తెలియపరచాలనే ఆయన ఆరాటపడేవారు. అలాంటి వ్యక్తి చివరకు ఉగ్ర ఘాతుకానికి బలైపోయారు. మరైకు భార్య, ఆరుగురు సంతానం. ఈ మధ్యే ఆయనకు కూతురు కూడా పుట్టింది.
నిబద్ధతకు ప్రతిరూపం... షా మరై మరణంపై ఏఎఫ్‌పీ స్పందించింది. ‘నిబద్ధత.. నిజాయితీ కలిగిన వ్యక్తి షా మరై. ధైర్యశాలి. ప్రాణాలను పణంగా పెట్టి ఆయన తీసిన ఫోటోలు ఎన్నో. ఆయన కెమెరా కన్నులొంచే యుద్ధ బీభత్సాన్ని ప్రపంచానికి తెలిసింది. అలాంటి కన్ను చివరకు చిధ్రమైపోయింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తున్నాం’ అని ఏఎఫ్‌పీ గ్లోబల్ న్యూస్ డైరెక్టర్ మైకేలే లెరిడాన్ ప్రకటన వెలువరించారు.
ఆయన తీసిన కొన్ని ఫోటోలు కింద
Comments
Please login to add a commentAdd a comment