అబ్బుర పరుస్తున్న'బర్త్ ఫొటోగ్రఫీ'
జీవితంలో కొన్ని విలువైన క్షణాలను ఫోటోల రూపంలో దాచుకోవడం మామూలే. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు ఫొటోగ్రఫీ రంగం కూడా అనేక కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలో విభిన్నరకాల ఫొటోలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గది బర్త్ ఫొటోగ్రఫీ. మిగతావాటితో పోలిస్తే ఇది ప్రత్యేకమైనదనే చెప్పాలి. భూ ప్రపంచంలో జీవి పుట్టుకను మించిన అందమైనది మరేదీ లేదన్న లిండ్సే స్ట్రాడ్నర్ మాటలు అక్షర సత్యాలు.
బర్త్ ఫొటోగ్రాఫర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (IAPBP) ప్రచురించిన కొన్ని ఫొటోలు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. 2016 సంవత్సరానికి నిర్వహించిన బర్త్ ఫొటోగ్రఫీ విజేతలను సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ ఫొటోలను సంస్థ వ్యవస్థాపకుడు లిండ్సే వెలువరించారు. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన ఫొటోగ్రాఫర్లు తీసిన అద్భుతమైన షాట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఒక కొత్త జీవి ప్రపంచంలోకి అడుగుపెట్టే క్షణాలను అపురూపంగా చిత్రించిన తీరు పలువురిని విస్మయపర్చింది. భావోద్వేగంతో కూడిన ఆ ఆనంద క్షణాలను పదిలంగా ఒడిసిపట్టుకున్న తీరు అద్భుతంగా నిలిచింది. ఈ కళలో ఆర్టిస్టుల నైపుణ్యాన్ని అభినందించి తీరాల్సిందే. ఆ ఫొటోలలో కొన్ని మీ కోసం...