తిమింగలం పొట్టలోని ప్లాస్టిక్ వ్యర్థాలు, తొలిగిస్తున్న వైద్యులు
బ్యాంకాక్ : ప్లాస్టిక్ భూతానికి ఓ భారీ తిమింగలం బలైంది. మానవుల నిర్లక్ష్యం ఆ సముద్ర జీవికి శాపంగా మారింది. థాయ్‌లాండ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్లాస్టిక్ వాడకంపై ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. దాని ప్రాణాలు నిలపడం కోసం ఐదు రోజులుగా ప్రయత్నించిన వెటర్నటీ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. థాయ్‌లాండ్, సంగాక్ల దక్షిణా ప్రాంతంలోని ఓ కెనాల్ సమీపాన అచేతన స్థితిలో ఉన్న ఓ భారీ తిమింగలాన్ని స్థానికులు గుర్తించి మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు.
తిమింగళం పొట్ట నుంచి తీసిన ప్లాస్టిక్ కవర్లు
విస్తుపోయే విషయాలు..
ఆ తిమింగలం అనారోగ్యానికి గల కారణాలను తెలుసుకోవడానికి వెటర్నీ డాక్టర్లు ప్రయత్నించగా.. విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. భారీ సంఖ్యలో ప్లాస్టిక్ బ్యాగులను తిమింగలం పొట్టలో పేరుకుపోయాయి. దాని పొట్ట నుంచి 5 ప్లాస్టిక్ బ్యాగ్‌లను తొలిగించగానే అది మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం దాని పొట్టలో మొత్తం 8 కేజీల బరువుగల 80 ప్లాస్టిక్ బ్యాగులను గుర్తించామని మెరైన్ కోస్టల్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇలా కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తిమింగలం జీర్ణవ్యవస్థ దెబ్బతిందని, దాని మృతికి ఇదే కారణమని వైద్యులు పేర్కొన్నారు.
కెనాల్ నుంచి తిమింగలాన్ని బయటకు తీస్తున్న వెటర్నటీ సిబ్బంది
చిన్న చేపలు, సముద్ర జీవులను వేటాడి ఆహారంగా తీసుకునే తిమింగలాలకు అవి లభించకపోవడంతో ప్లాస్టిక్‌నే ఆహారంగా తీసుకుంటున్నాయని మెరైన్ కోస్టల్ డిపార్ట్‌మెంట్ హెడ్ జతుపోర్న్ తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై థాయ్‌లాండ్ ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. థాయ్‌లాండ్ ప్రజలు ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతున్నారని చెప్పారు. 2050 నాటికి సముద్రాలలో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణమే ఎక్కువగా ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెచ్చరిస్తూ ఓ నివేదికలో వెల్లడించింది. మన దేశంలో కూడా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. ఇది జంతువులకు శాపంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment