
డాటా లీక్ కుంభకోణం నేపథ్యంలో ప్రముఖ మ్యాగజీన్ ప్లేబాయ్ ఫేస్‌బుక్‌కు షాక్ ఇచ్చింది. ఫేస్‌బుక్ నుంచి తన అధికారిక పేజీని డియాక్టివేట్ చేసింది. ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం లీక్ చేసి.. రాజకీయాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్న కథనాలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కథనాల నేపథ్యంలో ఇప్పటికే టెల్సా, స్పెస్ ఎక్స్ సంస్థలు తమ అధికారిక పేజీలను ఫేస్‌బుక్ నుంచి తొలగించాయి.
ప్లేబాయ్ మ్యాగజీన్ వ్యవస్థాపకుడి తనయుడు, చీఫ్ క్రియేటివ్ అధికారి కూపర్ హెఫ్నర్ తాజాగా తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీని తొలగించినట్టు ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్ సమాచార మార్గదర్శకాలు, కార్పొరేట్ పాలసీలు ప్లేబాయ్ విలువలకు విరుద్ధంగా ఉన్నాయని, లైంగిక సమాచార అణచివేతకు వేదికగా ఫేస్‌బుక్ మారిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా 5 కోట్లమంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం లీక్ అయిందన్న వార్తల నేపథ్యంలో తమ పేజీని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిపింది. దాదాపు 25 లక్షలమంది వినియోగదారులు ఫేస్‌బుక్‌లోని వివిధ ప్లేబాయ్ పేజీలను వీక్షిస్తారని, వీరి సమాచారాన్ని బయటపెట్టడం ఇష్టం లేక తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్లేబాయ్ వ్యక్తిగత స్వేచ్ఛను, శృంగార ఆస్వాదనను గౌరవిస్తుందని, ఫేస్‌బుక్ విధానం వినియోగదారుల అధిక సమాచారాన్ని బయటపెట్టేలా ఉందని పేర్కొంది. అయితే, ప్లేబాయ్ ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌లో కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment