మోదీకి రూ.3 లక్షల బహుమతులు
ఆర్టీఐ దరఖాస్తుకు విదేశాంగ శాఖ సమాధానం
న్యూఢిల్లీ: అధికారం చేపట్టాక త పది నెలల్లో జరిపిన విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్రమోదీ ఆతిథ్య దేశాలనుంచి రూ. 3.11 లక్షల విలువైన 65 బహుమతులను స్వీకరించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 19న జరిపిన పర్యటనలో ఆతిథ్య దేశంనుంచి రూ.75 వేల విలువగల బంగారం, వజ్రాలు పొదిగిన కఫ్‌లింక్స్‌ను బహుమతిగా స్వీకరించారు.
ఇవికాక ప్రధాని స్వీకరించిన బహుమతుల్లో పింగాణీ పాత్రలు, పెయింటింగ్స్ తదితరాలు ఉన్నాయి. ప్రధాని కూడా తన పర్యటనల్లో బుద్ధ విగ్రహంతోపాటు టీ కప్ సెట్, పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 -2013 మధ్య జరిపిన విదేశీ పర్యటనల్లో రూ. 83.72 లక్షల విలువైన కానుకలు స్వీకరించారు. 2010 నుంచి జూన్ 2013 వరకూ రాష్ట్రపతితోపాటు ఉపరాష్ట్రపతి, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ అధికారులు స్వీకరించిన బహుమతుల వివరాలనూ విదేశాంగశాఖ తెలియపరిచింది.
యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 2010 నుంచి జూన్ 2013 మధ్య జరిపిన విదేశీ పర్యటనల్లో రూ. 2 లక్షల విలువైన బ్రేస్‌లెట్‌తో సహా రూ. 3.84 లక్షల విలువైన బహుమతులను స్వీకరించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రూ.4.83 లక్షల విలువైన బహుమతులు అందుకున్నారు.