
ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, దుబాయ్: రక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నెల 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు.
అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్) మృదుల్ కుమార్ చెప్పారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుందని పేర్కొన్నారు. యూఏఈతో చర్చల సందర్భంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెక్ పెట్టే అంశాన్ని ప్రస్తావిస్తారా? అని ప్రశ్నించగా.. ఉగ్రవాద నిరోధంపై చర్చలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. భౌగోళికంగా ఒమన్‌తో సత్సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమన్నారు. ఉగ్రపోరులో పాలస్తీనా కీలక భాగస్వామని మరో సంయుక్త కార్యదర్శి బాల భాస్కర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment