Internal security
-
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్ మాట్లాడారు. నవంబర్ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు. ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్ ఉంకూడదని అన్నారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్య పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్ రవి వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్ సర్జికల్ స్ట్రైక్ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. చదవండి: మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం మన్మోహన్పై మండిపాటు మన్మోహన్ సింగ్ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సమయంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్ ఆరోపించారు. అప్పట్లో తీవ్రవాదుల హింస 185 జిల్లాల్లో ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గినట్లు వెల్లడించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు కశ్మీర్‌పై రవి మాట్లాడుతూ.. హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలన్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా.. మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావో ప్రాంతాల్లోని వారికి ప్రత్యేక ఐడియాలజీ ఉంటుందని, వాళ్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మరని అన్నారు. అయితే తాము దాన్ని అంగీకరించబోమని, ఇక వాళ్లతో చర్చలు అవసరం లేదని గవర్నర్ రవి తెలిపారు. చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
పోలీసులంటే ఇంకా భయమే
గాంధీనగర్: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు. విపరీతమైన పనిభారం పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్ఆర్యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్ఆర్యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్ఆర్యూ స్థాపన జరిగింది. రెండు రోడ్ షోలు వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది. -
అట్టడుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. మొత్తం రైతుల్లో 80 శాతం ఉన్న సన్నకారు రైతుల అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం, రికార్డు స్థాయిలో పంటల సేకరణ, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలు మన సమష్టి విజయాలని చెప్పారు. దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు ఇవి చోదక శక్తిగా పని చేస్తాయని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు ఘనతలను ప్రస్తావించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. గోవా విముక్తి పోరాట యోధుల స్మారకం నిర్మాణం, అఫ్గానిస్తాన్ నుంచి గురుగ్రంథ సాహిబ్ స్వరూపాలను వెనక్కి తీసుకురావడం, భారత్‌లో రైతాంగం సాధికారత కోసం సర్కారు కృషి వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా 2020–21లో రక్షణ రంగం ఆధునీకరణకు 87 శాతం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 209 రకాల రక్షణ పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్గా భావించాలని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులు నిరుపమాన సేవలందించారని కొనియాడారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే 150 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ప్రజలకు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు టీకా మొదటి డోసు, 70 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. 15–18 ఏళ్ల కేటగిరీకి కరోనా టీకా ఇస్తున్నట్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని గుర్తుచేశారు. అతిపెద్ద ఆహార పంపిణీ పథకం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 19 నెలల్లో 80 కోట్ల మంది లబ్ధి పొందారని, దీని కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకమని వివరించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ను తెరపైకి తెచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పెదవి విరిచారు. చైనా, పాకిస్తాన్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ, నాగాలాండ్‌లో పౌరుల ఊచకోతపై ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే 2021–22 నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకముందు తొలుత సభ ప్రారంభం కాగానే చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మహేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీలు జయంత రాయ్, దేబేంద్రనాథ్ బర్మన్, ఎం.మోజెస్, గణేశ్వర్ కుసుమ్, కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పార్లమెంట్ 255వ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల జాబితాను సెక్రెటరీ జనరల్ రాజ్యసభకు సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. సభా హక్కుల ఉల్లంఘన... పెగాసస్ స్పైవేర్ సమస్యపై గత ఏడాది పార్లమెంట్లో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం సోమవారం నోటీసు సమర్పించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఆధారంగా నోటీసును సమర్పించినట్లు తెలిపారు. స త్యాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందన్న ఆధారాలు బహిర్గతం అయ్యాయన్నారు. పెగాసస్‌పై ప్రత్యేక చర్చ అక్కర్లేదు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కోరుకుంటే ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అక్కర్లేదన్నారు. -
భద్రతతోనే ఆర్థికాభివృద్ధి : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ భద్రత ఆర్థిక పురోగతికి అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పోలీసు బలగాల ఆధునీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ దేశంలో భద్రతా పరిస్థితి మెరుగవకుంటే ఆర్థిక పురోగతి సాధ్యం కాదని చెప్పారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 49వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించే రోజులకు కాలం చెల్లిందని, దీనికోసం శాస్ర్తీయ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దర్యాప్తు ప్రక్రియలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని తెలిపారు. దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేశంలో అంతర్గత భద్రతను మెరుగ్గా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. -
కేంద్ర హోంశాఖ భేటీలో సీఎం జగన్
-
సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సోమవారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ముందుకురాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు అప్పగించడం, కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై చర్చించారు. రూ. 50 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చే దానిపై దృష్టి సారించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశం ఫలప్రదంగా ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల్లోని శాంతిభద్రతలు, అభివృద్ధి గురించి కీలకాంశాలు చర్చించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, డీజీపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచనలు యువత మావోయిజం వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టాల్సిన తక్షణ చర్యల గురించి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ మెడికల్ కాలేజీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నెలకొల్పాలని కోరారు. గిరిజన ప్రాంతమైన సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస) -
తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్ట్ సమస్యను ఎదుర్కోవడంలో తెలుగు రాష్ట్రాలు రోల్ మోడల్‌గా నిలిచాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న ఈ సమావేశంలో భద్రత, అభివృద్ధి, గిరిజన హక్కులపై చర్చిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితుల గురించి హోంశాఖ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. మధ్యాహ్నం సెషన్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ సీఎం భాఘెల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. (చదవండి: మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష) -
మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో పరిస్థితిని బేరీజు వేసేందుకు కేంద్రం సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, చత్తీస్‌గఢ్ సీఎం భాఘెల్, బిహార్ సీఎం నితీష్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఆయా రాష్ట్రాల డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చించనున్నారు. మావోయిస్టు ప్రాంతాల్లో భద్రత, అభివృద్ధి, గిరిజనుల హక్కుల పరిరక్షణ, మావోయిస్టు ప్రాబల్యం కలిగిన 105 జిల్లాల్లో అత్యంత ప్రభావితం కలిగిన 35 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇక తూర్పు తెలంగాణలోని భూపాలపల్లి, మహబూబ్‌బాబ్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల్లో కొంతకాలంగా మావోయిస్టులు ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. 22 రోజుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
పశ్చిమాసియాతో బంధం కోసం..
న్యూఢిల్లీ, దుబాయ్: రక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నెల 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్) మృదుల్ కుమార్ చెప్పారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుందని పేర్కొన్నారు. యూఏఈతో చర్చల సందర్భంగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెక్ పెట్టే అంశాన్ని ప్రస్తావిస్తారా? అని ప్రశ్నించగా.. ఉగ్రవాద నిరోధంపై చర్చలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. భౌగోళికంగా ఒమన్‌తో సత్సంబంధాలు భారత్‌కు చాలా ముఖ్యమన్నారు. ఉగ్రపోరులో పాలస్తీనా కీలక భాగస్వామని మరో సంయుక్త కార్యదర్శి బాల భాస్కర్ చెప్పారు. -
పాక్‌లో వేళ్లూనుతున్న ఐఎస్
ఇస్లామాబాద్: కిరాతకమైన ఐఎస్ ఉగ్రవాదం పాకిస్తాన్లో చాలా వేగంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఫర్ పీస్ స్టడీస్ (పీఐపీఎస్) సంస్థ తాజా గణాంకాలు విడుదల చేసింది. పాక్‌లో ఐఎస్ ప్రభావం ఉత్తర సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో విస్తృతంగా ఉందని పిప్స్ పేర్కొంది. ఇటీవల బలూచిస్తాన్‌లో ఇద్దరు చైనీయుల హత్యకు పాల్పడింది ఈ ఉగ్రవాద సంస్థేనని తెలిపింది. ‘స్పెషల్ రిపోర్ట్ 2017’ పేరుతో విడుదల చేసిన సర్వేలో పాకిస్తాన్ ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సవాళ్లను పిప్స్ నిర్వాహకులు పేర్కొన్నారు. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సంస్థల కన్నా తెహ్రిక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్, జమాతుల్ అహ్రార్ సంస్థలు పాక్ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. 2016తో పోలిస్తే 2017లో పాకిస్తాన్‌పై సీమాంతర దాడులు 131 శాతం పెరిగాయని తెలిపింది. -
భద్రతపై ప్రత్యేక దృష్టి
టెకాన్పూర్: దేశ అంతర్గత భద్రతపై సమీక్షతోపాటుగా భవిష్యత్తులో భద్రతను మరింత పటిష్టపరచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. దేశంలోని పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా చర్చించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీపంలోని బీఎస్ఎఫ్ అకాడమీలో జరుగుతున్న డీజీపీలు, ఐజీల వార్షిక సదస్సు లో మోదీ పాల్గొన్నారు. ఆదివారం దినమంతా మోదీ అధికారులతో విస్తృతమైన చర్చలు జరిపారు. ‘పోలీసింగ్, భద్రత అంశాలపై పోలీసు అధికారులతో చర్చించాను. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగింది. మూడేళ్లుగా తీసుకున్న నిర్ణయాల అమలుతీరుపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని మోదీ ట్వీట్ చేశారు. సోమవారం కూడా పోలీసు ఉన్నతాధికారులతో మోదీ సమావేశం కొనసాగనుంది. సదస్సు వివరాలు పూర్తిగా వెల్లడికానప్పటికీ.. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయటంతోపాటుగా జమ్మూకశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్లాలని మోదీ అధికారులకు సూచించినట్లు తెలిసింది. దాదాపు 250 మంది రాష్ట్రాల పోలీసు బాస్‌లు, కేంద్రీయ పోలీసు బలగాల సంస్థల అధిపతులు మూడ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. శనివారం కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోపన్యాసం చేస్తూ.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలు ఇంకా దేశంలో అక్కడక్కడ బయటపడుతున్నాయన్నారు. కశ్మీర్లో యువతను రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ ప్రతిక్షణం ప్రయత్నిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు, అక్కడ అల్లర్లకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాజ్‌నాథ్ ఆదేశించారు. గతేడాది హైదరాబాద్.. ఈసారి గ్వాలియర్ ప్రతి ఏడాదీ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు, కేంద్రీయ బలగాల ఉన్నతాధికారులు సమావేశమై దేశవ్యాప్తంగా ఉన్న భద్రతాపరమైన అంశాలపై చర్చిస్తారు. మామూలుగా ఈ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక. ఢిల్లీ బయట వేర్వేరు కేంద్రాల్లో ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. 2014లో గువాహటిలో, 2015లో రణ్ ఆఫ్ కచ్, 2016లో హైదరాబాద్‌లో ఈ సదస్సు జరిగింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో సీమాంతర ఉగ్రవాదం, ఉగ్రవాద ప్రేరేపిత అంశాలపై విస్తృత చర్చ జరిగింది. -
ఆందోళనకరం అంతర్గత భద్రత
జాతిహితం కశ్మీరీ ప్రజలలో, ప్రత్యేకించి యువతలో ఆశావాదాన్ని నింపడంలో ఎన్డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. ఒకప్పటిలాగే కశ్మీర్‌ను పూర్తి భద్రతా సమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. వాజ్‌పేయి కశ్మీర్ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్‌పేయి రచించినది కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయమైనదే తప్ప సైనికమైనది కాదు. దాదాపు దశాబ్ద కాలంగా దేశం ఇంతకు మున్నెన్నడూ ఎరుగని రీతిలో అంతర్గతంగానూ, బహిర్గతంగానూ కూడా మరింత ఎక్కువ సురక్షితంగా ఉన్న అద్భుతమైన దశలో ఉన్నదనే వాదన సమంజసమనే అనిపించవచ్చు. అది ముగింపునకు వచ్చేసిందని లేదా మంచైనా, చెడైనా ఏ దశైనా మిగతా అన్నిటిలాగే ముగిసిపోక తప్పదని ప్రకటించడం తొందరపాటు కావచ్చు. బహిర్గత పరిస్థితికి వస్తే, నెలల తరబడి వాస్తవాధీన రేఖ మండుతున్నా, మునుపటిలాగే ఉన్నది. మన సరిహద్దులన్నీ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ముప్పు ఏమీ లేదు. కానీ అంతర్గత పరిస్థితి మాత్రం బాగా ఆందోళనకరమని అనిపించసాగే స్థాయికి దిగజారింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పదవీ కాలం సగం ముగిసేసరికి అంతర్గత భద్రతకు సంబంధించిన పనితీరు సూచిక ఏ మాత్రం ఉత్సాహకరంగా లేదు. రెండున్నరేళ్లలో అంతా తలకిందులు 2014 వేసవిలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అంతర్గత పరిస్థితిలో సమంజసమైన స్థాయి సుస్థిరత నెలకొని ఉంది. కశ్మీర్ ప్రశాంతంగా ఉండగా, ఈశాన్యం దాదాపుగా పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అప్పట్లో ఎక్కువ ఆందోళనకరం ఉన్నది తూర్పు భారతం, ఆదివాసి భారతాల్లోని మావోయిస్టు లేదా హోంశాఖ ముద్దుగా పిలిచే వామపక్ష తీవ్రవాద (ఎల్డబ్యూఈ) ప్రభావిత ప్రాంతమే. సాయుధ మావోయిస్టు ఉద్యమాన్ని భారత దేశపు మొట్టమొదటి స్థాయి భద్రతా సమస్యగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ సరిగ్గా అంచనా వేశారు. అయినాగానీ యూపీఏ ప్రభుత్వం మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో పరస్పర విరుద్ధ వైఖరులను అనుసరించింది. పోలీసు, కేంద్ర బలగాలు మావోయిస్టులకు కలిగించిన నష్టాలతో పోలిస్తే, అవే చాలా పెద్ద ఎత్తున నష్టాలను చవిచూశాయి. ఎప్పుడు హత్యకు గురవుతామో అని లేదా చట్టవిరుద్ధమైన ‘‘పన్నులు’’, బలవంతపు వసూళ్లకు ఇక అంతే ఉండదేమో అనే భయం మన రాజకీయ వర్గాలను నిరంతంరం వెంటాడుతుండేది. స్వదేశంలోనే తలెత్తిన లేదా ఐఎస్ఐ దన్ను ఉన్న పాకిస్తానీ జిహాదీల వల్ల నిరంతర ప్రమాదం ఇక ఎలాగూ ఉండనే ఉండేది. ఏదేమైనా 2008 తర్వాతి కాలంలో ఈ విషయంలో సుస్థిరత నెల కొంది. అందువల్లనే హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు 2014 మేలో ఎల్‌డబ్ల్యూఈ, కశ్మీర్, ఈశాన్యం అనే క్రమంలో మన అంతర్గత భద్రతా సవాళ్లను పేర్కొనడంతో నేను ఏకీభవించవచ్చు. ఈ రెండున్నరేళ్ల కాలంలో పరిస్థితి గణనీయంగా మారింది. మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం సాపేక్షికంగా ప్రశాంతంగా ఉంది. భద్రతా బలగాల నష్టాలు కనీస స్థాయికి చేరాయి. ఎన్కౌంటర్లలో.. వాటిలో చాలావరకు అలా చిత్రించినవి లేదా కల్పనే అయినా... పలువురు చనిపోవడం, పట్టుబడటం వల్ల, పెద్ద ఎత్తున జరిగిన లొంగుబాట్ల వల్ల సాయుధ తిరుగుబాటు శ్రేణుల సంఖ్య బాగా క్షీణించిపోయింది. రాష్ట్రప్రభుత్వాలకు ఆ ప్రాంతాలపై మరింత ఎక్కువ నియంత్రణ ఏర్పడటం, గనుల తవ్వకాలు సాగుతూండటం శుభ సూచకం. కానీ మన మిగతా రెండు ప్రధాన సవాళ్లకు సంబంధించి పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ సవాళ్లను ఇప్పుడు కశ్మీర్, ఈశాన్యం, మావో యిస్టు ప్రాబల్య ప్రాంతం అనే ప్రాధాన్య క్రమంలో అమర్చాల్సివస్తోంది. ఇక ఐఎస్ఐ/ఐఎమ్/ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం ముప్పు మునుపటిలాగే పొంచి చూస్తూనే ఉంది. ఒక దశాబ్దం తర్వాత కశ్మీర్ ఈ జాబితాలో ప్రథమ స్థానం లోకి వచ్చింది. అందుకు పలు బహిర్గత, అంతర్గత అంశాలు కారణం. ప్రస్తుతం పాక్‌తో మన సంబంధాలు మరీ దిగజారి ఉన్నాయి. మన వైపు నుంచి తీసుకున్న రాజకీయ నిర్ణయమే అందుకు కారణం. అయితే కశ్మీర్‌కు సంబంధించి అత్యంత ఆందోళనకరమైన కోణం మాత్రం అంతర్గతమైనదే. గత కొన్ని నెలలుగా కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి అత్యంత అధ్వానంగా ఉన్న 2010–11 రోజులను జ్ఞప్తికి తెస్తోంది. అయితే, శాంతియుతంగా ఎన్ని కలు జరగడం, రాజకీయ క్రమం తిరిగి మొదలుకావడంవల్ల సిద్ధించిన రాజ కీయ ప్రయోజనాలను చాలా వరకు కోల్పోవాల్సి రావడం మరింత ప్రాధా న్యం గల అంశం. రాజనీతియుక్తంగా పరస్పర విరుద్ధ భావజాల శక్తు లైన పీడీపీ, బీజేపీల మధ్య ఏర్పడ్డ కలయిక నుంచి ఎంతో ప్రయోజనం సిద్ధిస్తుం దని ఆశించాం. కానీ కార్యరంగంలో అది విఫలమైంది. అది నిజంగా సాధిం చగలిగి ఉండగలిగే దానితో పోలిస్తే ఆ కూటమి కృషి దానికి నీడగా కూడా మిగలలేదు. ఈ వారం మొదట్లో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడి నదానిలో ఆవేదనే ఎక్కువ తప్ప, నిజంగా స్థానిక ప్రజలపై యుద్ధం సాగించా లనే ఉద్దేశం మాత్రం కాదు. కశ్మీర్ లోయలో క్షేత్ర స్థాయిలో తలెత్తున్న పరిస్థితి వల్ల కలిగిన నిస్పృహ అది. వాజ్‌పేయి విధానం ఇదేనా? వాస్తవాధీన రేఖపై ఎదురయ్యే సవాళ్లకు ఇది భిన్నమైనది. అక్కడి పరిస్థితితో వ్యవహరించగల శక్తిసామర్థ్యాలు మన సైన్యానికి దండిగా ఉన్నాయి. మనది యుద్ధాల్లో రాటుదేలిన సేన, సమరోత్సాహంతో ఉవ్విళ్లూరుతూంటుంది. కానీ అల్పస్థాయి, పట్ణణ సైనిక చర్యలను చేపట్టడం, ఆగ్రహావేశపరులై ఉన్న వేలాది మంది పౌరులతో వ్యవహరించడం అనేవి పూర్తిగా విభిన్నమైనవి. అలాంటి సమస్యలతో వ్యవహరించడానికి మన సైన్యం సంసిద్ధమై లేదు. అల్లర్లకు దిగే గుంపులవద్ద ఉండే అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు రాళ్లే. ఇజ్రాయెల్, తమ ప్రజలుగా భావించని అలాంటి గుంపు లపై ప్రయోగించిన ఎంతో కఠిన చర్యలు ౖసైతం ఫలితాలను ఇవ్వలేదు. కాబట్టి ఇజ్రాయెల్ సైనిక మేధస్సు అనేది ఉత్త డొల్లగా బయటపడిపోయింది. ఇజ్రాయెల్ ప్రయోగిం చిన పద్ధతులతో ఏ కొద్దిగానో పోల్చడానికైనా తగిన ఎలాంటి ప్రాణాంతక మైన లేదా ప్రాణహాని కలిగించని ఆయుధాలను సొంత భూభాగంలోని ప్రజ లపై భారత సైన్యం ప్రయోగించగలిగే అవకాశం లేదు. కశ్మీరీ ప్రజలను, ప్రత్యేకించి యువతను పాలనలో మరింతగా భాగస్వా ములను చేయడంలో, మరీ ముఖ్యంగా భవిష్యత్తు పట్ల ఆశావాదంతో ఉండ గలిగేలా చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌లోని పీడీపీ–బీజేపీ కూటమి విఫలమయ్యాయి. అదే వాటి ప్రధాన వైఫల్యం. ఈ క్రమంలో, ఒకçప్పటి 2002కు ముందటి రక్తసిక్త కాలం నాటిలో లాగే కశ్మీర్ సమస్యను పూర్తి భద్రతాసమస్యగా చూసే వైఖరికి తిరిగిపోయారు. అంటే, గూఢచార సంస్థలను కంట్రోల్ రూంలో ఉంచి సైన్యాన్ని ముందుశ్రేణిలో నిలిపే వైఖరికి తిరిగిపోయారు. అటల్ బిహారీ వాజ్‌పేయి అనుసరించిన కశ్మీర్ విధానమే తనకు ఉత్తేజమని మోదీ అన్నారు. కానీ ఇది వాజ్‌పేయి రచించిన సన్నివేశం కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత మోదీపైనే ఉంది. అందుకు ఆయన చేయాల్సిన కృషి రాజకీయపరమైనదే తప్ప వ్యూహా త్మకమైనది, ఎత్తుగడలపరమైనది లేదా సైనికపరమైనది కాదు. కేంద్ర సాయుధ బలగాలను (సీఏపీఎఫ్‌లను) ఎంత విస్తృత స్థాయిలో మోహరింపజేశామనేది అంతర్గత భద్రతకు ముఖ్య సూచిక. సంఖ్య రీత్యా వాటి బలం నేడు 10 లక్షలకు దాటింది (మన రెగ్యులర్ సైన్యం 13 లక్షలు). ప్రపంచంలోనే మనది అతి పెద్ద ఈఏపీఎఫ్. ఆ బలగాలను మనం దాదా పుగా రిజర్వు బలగాలే లేని విధంగా పూర్తి స్థాయిలో మోహరించాం. రాష్ట్రాల ఎన్నికలు కూడా కొంతవరకు కారణం. అయితే మార్చి తర్వాత సైతం వాటికి కాస్త వెసులుబాటు కలగడం కష్టమే. రాజకీయ క్రమం తిరిగి మొదలైతే తప్ప, చలికాలపు మంచు కరగడం ప్రారంభం కావడంతోనే కశ్మీర్‌లోయలో తిరిగి ‘‘సైనికచర్యల’’ కాలం ప్రవేశి స్తుంది. అది కూడా ఇందుకు కొంతవరకు కారణం. అయితే, ఇంతవరకు తక్కువ ఆందోళనకరంగా ఉన్న ఈశాన్యంలోకూడా ఇప్పుడు అశాంతికర కార్యకలాపాలు ఉ«ధృతమవుతున్నాయి. మళ్లీ రగులుతున్న ఈశాన్యం 1980ల మధ్యలో రాజీవ్‌గాంధీ మిజోరాం తిరుగుబాటుదార్లతో, అస్సాం ఆందోళనకారులతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇంతగా ఆందోళనలు సాగుతుండటం ఇప్పుడే. గతంతో పోలిస్తే ఈశాన్యంలో ఇప్పుడు తక్కువ సైన్యం ఉంది. ఈశాన్యంలో తిరిగి రాజుకుం టున్న సమస్య సైనికపరమైనది కాదు, రాజకీయమైనది. దానితో వ్యవహరిం చడం ఇంకా ఎక్కువ కష్టభరితమైనది. మణిపూర్, జాతుల మధ్య అరాచకం చురుగ్గా ఉన్న రాష్ట్రం. అక్కడికి మరిన్ని సీఆర్పీఎఫ్ కంపెనీలను, వైమానిక దళ విమానాల్లో డీజిల్‌ను పంపడమూ తప్ప ఎవరూ ఏమీ చేస్తున్నట్టు అని పించడం లేదు. వేర్పాటువాద తిరుగుబాటు ఏళ్ల తరబడి సద్దుమణిగి ఉన్న సమయంలో ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు. లోయలోని ప్రజలకు, కొండలలోని తెగలకు మధ్య సంఘర్షణ కాబట్టి పరిపాలనా వైఫల్యం కొన సాగుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఎన్నికల లబ్ధికోసం రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. నాగాలాండ్ కథ మరింత సంక్లిష్టమైనది, నిరుత్సాహ çకరమైనది. అతిపెద్ద తిరుగుబాటు గ్రూపుతో ఒకే ఒక్క పేజీ సూత్రప్రాయ అంగీకారపత్రంపై సంతకాలు చేసి, ఒప్పందం కుదురిందన్నారు. దీంతో శాంతి ప్రక్రియ చల్లారిపోతున్నది. వివిధ గ్రూపుల మధ్య వైరం, సంఘర్షణ లకు ఇది సమయాన్ని కల్పించింది. ఈ గ్రూపులన్నీ బహిరంగంగా ఆయు ధాలు ధరించి ‘‘పన్నులు’’ వసూలు చేస్తున్నాయి. ఆయా గ్రూపులకు వాటి సొంత ప్రాబల్య ప్రాంతాలున్నాయి. అక్కడ వాటికి ఎదురు లేదు. స్థానికు లతో కలగలసిపోయి అరుణాచల్ లోతట్టు జిల్లాలకు అవి విస్తరిస్తున్నాయి. ఇది త్వరలోనే సున్నితమైన చమురు జిల్లాలున్న ఎగువ అస్సాంకు వ్యాపించ నుంది. రెండు దశాబ్దాల తర్వాత ఈశాన్యం నేడు తిరిగి సమస్యాత్మక ప్రాతం అవుతోంది. మొత్తంగా చూస్తే మన అంతర్గత భద్రత పరిస్థితి ఇంత కంటే చాలా మెరుగ్గా ఉండాల్సింది. తాజా కలం: కశ్మీర్‌లోయలోని అశాంతి నాకు, 1989లో నాటి హోం మంత్రి బూటాసింగ్‌తో జరిగిన ఒక సంభాషణ నుæ గుర్తుకుతెస్తోంది. నాటి రష్యా విదేశాంగ మంత్రి ఎడ్వర్డో షెవర్దనాజే ఆయనను ఒకసారి... ఇంతింత భారీ గుంపులతో భారత్ ఎలా వ్యవహరిస్తోందని ఆశ్యర్యం వ్యక్తం చేశారట. దానికి బూటాసింగ్ ‘‘గుంపులను అదుపు చేయడానికి మేం సైన్యాన్ని ప్రయో గించం. వారు చేయగలిగింది మారణాయుధ ప్రయోగమే... అందుకు మాకు సీఆర్పీఎఫ్ అనే బలగం ఉంది. కావాలంటే మీ వాళ్లకు శిక్షణ ఇవ్వడా నికి ఓ రెండు బెటాలియన్లను పంపుతాను’’ అన్నారట. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
‘కంచె’లేని భద్రత!
సబ్‌జైలు అంతర్గత భద్రతపై అనుమానాలు రక్షణగోడకు పూర్తిగా లేని పెన్షింగ్ సివిల్ పోలీసుల పాత్ర ఎంతవరకు..? నేరాలకు అలవాటుపడి..జైలు గదులు రుచించక చాకచక్యంగా పరారైన రిమాండ్ ఖైదీ బొబ్బిలి : నిత్యం ‘మత్తు’కు అలవాటు పడిన 25 ఏళ్ల యువకుడు... గంజాయి కోసం ఎటువంటి పని చేయడానికైనా వెనుకాడని నైజం.. తల్లిదండ్రులు పేదరికంలో ఉండడంతో బయట తిరుగుళ్లకు అలవాటు పడి, ఆలయాల బయట గంజాయి సేవించి రాత్రంతా మత్తులోనే జోగేవాడు. చివరికి ఓ దోపిడీ కేసులో కటకటాలపాలయ్యాడు. అలాంటి వ్యక్తికి జైలు శిక్ష రుచించలేదు.. రోజంతా బందీఖానాలో ఉండడం.. ధూమపానం, గంజాయి వంటివి అందుబాటులో లేకపోవడంతో ఎలాగైనా బయట పడాలని ప్లాన్ వేశాడు.. అనుకున్న ప్రణాళికను తు.చ. తప్పకుండా పక్కాగా అమలు చేసి, జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఇటు జైలు శాఖ సిబ్బందికి, అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఒడిషా రాష్ర్టం జైపూర్‌కు చెందిన ధనురాన అలియాస్ బడాపెట్టు (ఖైదీ నంబర్ 2576). నేరాలే అతని వృత్తి.. 2014లో రామభద్రపురం వద్ద లారీడ్రైవర్‌ను, క్లీనర్‌ను చితకబాది.. వాహనంతోపాటు ఉడాయించిన కేసులో ధనురాన ఎ2 నిందితుడిగా ఉన్నాడు. అప్పటివరకూ గంజాయికి అలవాటు పడిన అతను.. అది లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితి జైలులో ఏర్పడింది. నాలుగు మాసాలుగా బొబ్బిలి సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ధనురాన.. అవకాశం దొరికితే పరారవ్వడానికే నిర్ణయించుకున్నాడు. అదును చూసి.. గోడ దూకాడు! సహచర ఖైదీలతో కలసి 2వ నంబరు గదిలో ధనురాన ఉండేవాడు. జైలు చుట్టూ గోడపై విద్యుత్తు కంచె ఏర్పాటు చేసిన అధికారులు ఖైదీలుండే గదుల సమీపంలోని గోడకు మాత్రం పెట్టలేదు. అదే పరారైన ధనురానకు కలిసొచ్చింది... దారి దోపిడీ కేసులో నిందితుడు జైలులో ఉన్నా ఇటు జైలుశాఖ ఉద్యోగులు, అటు సివిల్ పోలీసులు.. సాధారణ ఖైదీలలాగానే బందోబస్తులను నిర్వహించారు. ప్రతిరోజూ ైఖైదీలను రోజుకు మూడుసార్లు బయటకు తీసుకువస్తారు. ఉదయం అల్పాహారం, పది గంటలకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం 5 గంటలకు రాత్రి భోజనం పెట్టి తిరిగి గదిలోనికి పంపించేస్తారు. ఈ నెల 24న సబ్‌జైలులో ఉండే 17 మంది నిందితులతోపాటు ధనురాన కూడా సాయంత్రం భోజనానికి వచ్చాడు. ఎప్పుడూ భోజనాన్ని ఆలస్యంగా చేసే నిందితుడు.. ఆ రోజు తొందరగా తినేసి తన గది వైపు వచ్చాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. గదులపై ఉండే సిమెంటును రేకు పట్టుకొని మీదకు చేరి అక్కడుండే పెన్షింగ్ జాయింట్ తొలగించి, దానిని సాగదీసి క్షణాల్లో బయటపడ్డాడు. పాత సబ్ట్రైజరీ కార్యాలయం వైపు దిగి జనాల్లో కలిసిపోయాడు. జైలు కట్టినప్పుడు వేసి ఇనుప పెన్షింగ్ ఎండకు ఎండటం, వానకు తడవడం వల్ల పూర్తిగా పాడైపోవడంతో దానిని సాగదీయడం అతనికి సులభతరమైంది. అక్కడ నుంచి అతను సొంత గ్రామం జైపూర్ వెళ్లిపోవడానికి రామభద్రపురం వైపు వెళ్తున్న లారీని పట్టుకొని పరారైనట్లు సమాచారం. ఖైదీల బేరక్స్‌కు తాళాలేసుంటే! ఖైదీలు గదుల్లో ఉన్నప్పుడు, వారంతా బయటకు వచ్చినప్పుడు వారుండే బేరక్స్‌కు తాళాలు వేయాలి. ఆ బాధ్యతను జైలు శాఖ నిర్వహిస్తుంటుంది. అయితే సాధారణంగా సబ్ జైలులో దీనిని పాటించరు. ముద్దాయిలు పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోరనే నమ్మకంతో వారిని లోపల కొంచెం చూసీచూడనట్లు వదిలేయడమే ఖైదీ పరారవ్వడానికి ఆస్కారం కలిగిందనే వాదన వినిపిస్తోంది. సివిల్ పోలీసుల పాత్ర ఎంత? ఖైదీ పరారవ్వడంతో దానికి బాధ్యతగా సివిల్ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలలని జైళ్ల శాఖ ఎస్పీకి ప్రతిపాదనలు పెట్టింది. సబ్ జైలులో ప్రతి రోజూ ఒక హెచ్‌సీ, నలుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుంటారు. వీరిని పట్టణ, రూరల్ పోలీసులు సంయుక్తంగా స్టేషన్ల నుంచి ఒక్కొక్కరిని ఈ విధులకు వేస్తుంటారు. సెంట్రీ డ్యూటీతోపాటు రక్షణకు వీరిని వినియోగిస్తారు. సివిల్ పోలీసులు వారి విధుల్లో సక్రమంగా లేకపోతే వెంటనే హౌస్ అధికారికి జైళ్ల శాఖ ఫిర్యాదు చేయాలి. ఈ విధుల్లో ఉన్న వారిలో ఒక కానిస్టేబుల్‌కు వీక్లీ ఆఫ్ తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఖైదీ పరారైన రోజు విధుల్లో ఉన్న సివిల్ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ నలుగురిని సిఫార్సు చేస్తూ జైళ్ల శాఖ జిల్లా ఎస్పీకి ప్రతిపాదనలు పంపింది. అయితే జైలు లోపల జరిగిన సంఘటనకు సివిల్ పోలీసులు ఎలా బాధ్యత వహిస్తారని ఆ శాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నా.. మరి జిల్లా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి -
విశేషాధి’కారం’
-
పెత్తనం కుదరదు
* కేంద్రంపై కేసీఆర్ ఫైర్ * మోడీ ఫాసిస్టు చర్యలను ఖండిస్తున్నట్లు వ్యాఖ్యలు * ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పించాలంటూ కేంద్రం తాజాగా పంపిన లేఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఇచ్చిన ఈ ఆదేశాలను అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ అధికారాలను కబళించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఫాసిస్టు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కూడా లేఖ రాయాలని ప్రధాన కార్యదర్శికి సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన లేఖను అన్ని రాష్ట్రాల సీఎంలకు పంపించాలని, త్వరలోనే సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వివరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫాసిస్టు ధోరణిని ప్రతిఘటించేందుకు ప్రజాస్వామ్య ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. కేంద్రం పంపిన లేఖలోని అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను అమలు చేయమని ప్రకటించారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కల్పించాలని, అందుకు అవసరమైన విధంగా తెలంగాణ ప్రభుత్వం బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేసుకోవాలని గత నెలలోనే కేంద్ర హోం శాఖ నుంచి లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలో ఉమ్మడి పోలీసింగ్ వ్యవస్థను అమలు చేయాలని, ఇరు రాష్ట్రాల డీజీపీలతో కమిటీ వేయడంతోపాటు, నగరంలో పోలీసు అధికారుల నియామకానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వారిని పరిగణించాలని అందులో సూచించింది. దీనికి రాష్ర్ట ప్రభుత్వం కూడా ఘాటుగానే బదులిచ్చింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8లో ఉన్న ప్రకారం నడచుకుంటామే తప్ప.. గవర్నర్‌కు అధికారాలు కల్పించేలా బిజినెస్ రూల్స్‌ను మార్చబోమని తేల్చి చెప్పింది. ఇదంతా జరిగిన నెల రోజుల తర్వాత కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ పేరిట శుక్రవారం రాత్రి మరో లేఖ రాష్ర్ట ప్రభుత్వానికి అందింది. అయితే ఇందులో ఇరు రాష్ట్రాల పోలీసుల అధికారులను నియమించాలన్న నిబంధనను తొలగించారు. -
పవర్ గవర్నర్దే..
* విశేషాధికారాలపై కేంద్రం మళ్లీ లేఖ * ఇద్దరు పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు * సర్కారు నుంచి రికార్డులు తెప్పించుకునే అధికారం సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్యమైన కేంద్ర సంస్థల రక్షణ బాధ్యతలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు, స్వేచ్ఛా పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ చేతుల్లోనే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టాలంటూ తాజాగా తెలంగాణ సర్కారుకు మరో లేఖ రాసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్‌కుమార్ నుంచి వచ్చిన ఈ లేఖ శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందింది. విభజన చట్టంలోని సెక్షన్ 8, దాని సబ్సెక్షన్లకు సంబంధించి గవర్నర్‌కు ఉండే ప్రత్యేక బాధ్యతలను పేర్కొనడంతో పాటు, గవర్నర్ నిర్వర్తించే బాధ్యతలను కూడా ఈ లేఖలో వివరించారు. వీటి అమలుకు సంబంధించి పరిపాలన సజావుగా సాగడానికి మార్గదర్శకాలను కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఇవీ మార్గదర్శకాలు * మంత్రి మండలి, ఏదైనా సంస్థ తీసుకునే నిర్ణయాల రికార్డులను, సమాచారాన్ని తెప్పించుకునే అధికారం గవర్నర్‌కు ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు, భారీ నేరాల ప్రత్యేక నివేదికలను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ ఎప్పటికప్పుడు గవర్నర్‌కు సమర్పించాలి. * శాంతిభద్రతల నియంత్రణ చట్టానికి అనుగుణంగా పోలీస్ ఉన్నతాధికారులకు గవర్నర్ ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వవచ్చు. శాంతిభద్రతలు, పరిపాలన అంశాల్లో గవర్నర్‌కు ఆయన సలహాదారులు సహకారం అందిస్తారు. వీరికి అవసరాన్ని బట్టి గవర్నర్ బాధ్యతలు అప్పగిస్తారు. * శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల భద్రత, ప్రత్యేక పరిస్థితులపై నివేదికలను రెండు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీ, తెలంగాణ హోం శాఖ కార్యదర్శి కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలి. దీనిపై గవర్నర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తారు. ఈ అంశాల్లో గవర్నర్ ఆదేశాలే అంతిమంగా అమలవుతాయి. * ఆ రెండు కమిషనరేట్లలో ఐజీ ర్యాంకుకు తగ్గని సీనియర్ అధికారులతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. వీరితోపాటు రంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలోనూ ఏర్పాటు చేయాలి. * బలవంతపు వసూళ్లు, విద్వేషాలు రెచ్చగొట్టే నేరాలపై సత్వర విచారణ నిర్వహించాలి. కోర్టుల్లో వేగంగా విచారణ జరిగేలా చర్య తీసుకోవాలి. ఈ సెల్‌లోని అధికారుల సెల్‌ఫోన్ నంబర్లతోపాటు, చిరునామాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. * అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల రక్షణకు జంట కమిషనరేట్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి వీరందరిపై సీనియర్ అధికారిని నియమించాలి. ఈ సెల్ సున్నితమైన సంస్థలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ద్వారా గవర్నర్‌కు నివేదించాలి. ప్రస్తుతం ఈ సంస్థలకు ఎస్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ ద్వారా కల్పిస్తున్న సెక్యూరిటీని సమీక్షించి, పటిష్ట భద్రతను కల్పించాలి. రక్షణ బలోపేతానికి గవర్నర్ చేసే సూచనలను విధిగా అమలు చేయాలి. ఇందుకోసం సీనియర్ అధికారిని నియమించి భద్రతా పరిస్థితిని ఎప్పటికప్పుడు గవర్నర్‌కు నివేదించాలి. * తెలంగాణ డీజీపీ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పోలీసు సర్వీస్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ద్వారానే డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓల వరకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలి. ఈ బోర్డు చేసిన ప్రతిపాదనలపై గవర్నర్ సలహాలు, సూచనలతో మార్పులు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. * అత్యవసర పరిస్థితుల్లో బలగాల మోహరింపుపై గవర్నర్ చేసే సూచనలను టీ సర్కారు పరిశీలించి మళ్లీ గవర్నర్‌కు పంపించాలి. దీనిపై గవర్నర్దే తుది నిర్ణయం. ఉమ్మడి రాజధాని పరిధిలో చట్టాల ఏర్పాటు, కమిషన్ల నియామకం, చట్టాల్లో సెక్షన్ల తొలగింపునకు సంబంధించిన నివేదికను చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. చట్టాల రూపకల్పన, కమిషన్ల ఏర్పాటునకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై నివేదిక కోరే అధికారం ఉంటుంది. * అవసరాన్ని బట్టి ఉద్యోగుల తాత్కాలిక పద్ధతిలో పునర్నియామకానికి ప్రభుత్వాన్ని గవర్నర్ కోరవచ్చు. ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపునకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం సలహాలతో గవర్నర్ నిర్వహణ సాగిస్తారు. * ఉమ్మడి రాజధానిలో నివసిస్తున్న ప్రజల ఆస్తుల రక్షణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్లతో ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేయాలి. ఫిర్యాదుదారుల ఆస్తుల రక్షణ, హక్కులపై ప్రభుత్వ అధికారులకు గవర్నర్ అవసరమైన ఆదేశాలు జారీచేస్తారు. వాటిని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శికీ పంపారు.