టోక్యో : జపాన్‌లో జరుగుతున్న జీ 20 సదస్సు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ఇరాన్ వ్యవహారాలు, 5జీ నెట్‌వర్క్, వాణిజ్య, రక్షణ రంగాలకు సంబంధించి పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. రక్షణ సహకారం పెంపుదల, శాంతి సుస్ధిరతలను కాపాడటం, వర్తక లోటును అధిగమించడం సహా పలు అంశాలపై ఇరువురు నేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారని వైట్ హౌస్ ట్వీట్ చేసింది.
మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై చర్చ జరిగిందని భారత్ వాణిజ్యపరంగా తీసుకుంటున్న చర్యలను ట్రంప్ స్వాగతించారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. ట్రంప్, మోదీల భేటీ ఫలవంతంగా సాగిందని అన్నారు. 5జీ సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకునేందుకు భారత్ చేపడుతున్న చర్యలను వివరించగా ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ అంశంలో అమెరికా-భారత్ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ఇదే తొలిసారి.
లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికార పీఠం అధిష్టించిన మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇంతటి భారీ విజయానికి మీరు అర్హులని ప్రధాని మోదీని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్, మోదీ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారని పీఎంఓ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment