
అనిశ్చితి తొలగిపోవాలి
పోప్ క్రిస్మస్ సందేశం
వాటికన్ సిటీ: ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి, అస్థిరత తొలగిపోయి ప్రశాంత వాతావరణం నెలకొనాలని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీ నుంచి సన్నీ స్క్వేర్‌లోని 10వేల మంది భక్తుద్దేశించి పోప్ తన సందేశాన్నిచ్చారు. సిరియా, లిబియానుంచి వస్తున్న శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని ప్రశంసించారు. సిరియా అంతర్యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఐక్యరాజ్యసమితి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈజిప్ట్ గగనతలంలో, బీరుట్, పారిస్, బమాకోలలో జరిగిన ఉగ్రవాద చర్యలను ఆయన ఖండించారు.
ఐసిస్ ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరుతున్నాయని.. పురాతన కట్టడాలను ధ్వంసం చేయటం తగదన్నారు. చర్చిలనుంచి ముస్లింల సమాధుల వరకు దేన్నీ వదలటం లేదని, పశ్చిమాసియా దేశాల్లో క్రైస్తవుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాక్, యెమెన్, బురుండీ, దక్షిణ సుడాన్‌లలో హింసతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని.. ఇళ్లు వదిలిపోతున్నారని పోప్ అన్నారు. కాగా, క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు జన్మించిన బెత్లెహామ్‌లోని చర్చ్ ఆఫ్ నేటివిటీలో గురువారం రాత్రి ప్రార్థనా కార్యక్రమం ఘనంగా జరిగింది.