పిల్లల్లో కేన్సర్‌కు శక్తిమంతమైన ఔషధం!
గుర్తించిన పరిశోధకులు
వాషింగ్టన్: బాల్యంలో వచ్చే ప్రాణాంతక కేన్సర్‌కు శక్తిమంతమైన ఔషధాన్ని పరిశోధకులు గుర్తించారు. నాడీకణాలకు సంబంధించిన న్యూరోబ్లాస్టోమా కేన్సర్ చికిత్సకు వినియోగించే యాంటీకేన్సర్ ఔషధం క్రిజిటినిబ్‌పై చేసిన గత పరిశోధనల అనుభవాల ఆధారంగా కొత్త చికిత్సా విధానాలను ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రి (సీహెచ్‌ఓపీ) పరిశోధకులు గుర్తించారు. కొత్త ఔషధంపై తాము నిర్వహించిన తొలిదశ ఔషధపరీక్షల (ప్రీడ్రగ్ ట్రయల్స్) ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, ఇప్పుడు ఔషధ పరీక్ష లు నిర్వహించాల్సి ఉందని సీహెచ్‌ఓపీ ఆంకాలజిస్ట్ యేల్ పి మోస్సే చెప్పారు.
న్యూరోబ్లాస్టోమాకు దారితీసే అనప్లాస్టిక్ లింఫొమా కినాస్ (ఏఎల్‌కే) జన్యువుల ఉత్పరివర్తనలను, 2008లో అరుదైన, వంశపారంపర్య జన్యువులు న్యూరోబ్లాస్టోమాకు కారకాలంటూ మొదటిసారి తాము గుర్తించిన విషయాలను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఏఎల్‌కేలో వచ్చే అసాధారణ మార్పులు.. 14% ప్రాణాంతక న్యూరోబ్లాస్టోమాకు కారణమవుతున్నట్లు గుర్తించారు.