కాశ్మీర్ను భారత్ నుంచి లాక్కుంటాం: బిలావల్
దివంగత పాక్ నాయకురాలు బేనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మొత్తం కాశ్మీర్ను భారత్ నుంచి లాక్కుంటామని, అందుకు తమ పార్టీ (పీపీపీ) కృషి చేస్తుందని అన్నాడు పాకిస్థాన్ పంజాబ్లోని ముల్తాన్ ప్రాంతంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అతనీ వ్యాఖ్యలు చేశాడు. ''నేను మొత్తం కాశ్మీర్ను వెనక్కి తీసుకుంటా. అందులో ఒక్క అంగుళం కూడా వదలను. ఎందుకంటే, ఇతర రాష్ట్రాల్లాగే అది కూడా పాకిస్థాన్కే చెందుతుంది'' అని భుట్టో కుటుంబ వారసుడు ప్రగల్భాలు పలికాడు.
బిలావల్ ఈ వ్యాఖ్యలు చేసే సమయంలో పాక్ మాజీ ప్రధానమంత్రులు యూసుఫ్ రజా గిలానీ, రజా పర్వేజ్ అషారఫ్ అతడికి రెండువైపులా ఉన్నారు. 2018లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ముందే ప్రకటించిన బిలావల్.. అందుకోసం పాక్ ప్రజలను రెచ్చగొట్టడానికే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి అతడి తల్లి బేనజీర్ భుట్టో రెండుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టో 1967లో పీపీపీని స్థాపించారు. బిలావల్ తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.