రియాద్ : సౌదీ అరేబియా యువరాజులలో ఒకరైన మన్సూర్ బిన్ మోక్రెన్ చనిపోయి 24 గంటలు గడవక ముందే మరో యువరాజు మృతి చెందాడన్నది అవాస్తమని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. గతంలో మృతిచెందిన సౌదీ అరేబియా రాజు ఫహద్ కుమారుడు అబ్దుల్ అజిజ్ ఫహద్ (44)పై కొందరు కాల్పులు జరపగా యువరాజు మరణించాడన్న కథనాలు అవాస్తవాలని సౌదీ అరేబియా ప్రభుత్వం ఏజెన్స్ ఫ్రాన్స్ మీడియాకు తెలిపింది. యువరాజు అబ్దుల్ అజిజ్ ఆరోగ్యంగా, నిక్షేపంగా ఉన్నారని సమాచార మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వివరించారు. ఏజెన్స్ ఫ్రాన్స్ మీడియా యువరాజు అజిజ్‌ను సంప్రదించేందుకు యత్నించినా వీలు చిక్కలేదని తమ కథనంలో పేర్కొంది.
ఆదివారం మధ్యాహ్నం హెలికాప్టర్ క్రాష్ కావడంతో అసిర్ ప్రావిన్స్‌కి ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న మన్సూర్ బిన్ మోక్రెన్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గతంలో సౌదీ అరేబియాను పాలించిన కింగ్ ఫహద్ కుమారుడు అబ్దుల్ అజిజ్‌పై ఆ మరుసటిరోజు కొందరు దుండగులు కాల్పులకు తెగబడగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా కొన ఊపిరితో ఉన్న యువరాజు మరణించినట్లు అజ్ మస్‌డార్ నెటవర్క్ మీడియా వెల్లడించింది. అరెస్ట్ చేయడానికి వెళ్లగా జరిపిన కాల్పుల్లో అజిజ్ చనిపోయాడని మరో స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే ఇటీవల కొందరు రాజులు, యువరాజులు, మంత్రులు, ఉన్నతాధికారులను సౌదీ రాజు ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. మరికొందరు విదేశాలకు పారిపోతున్నారు. వీరిలో సౌదీ గత పాలకుడు ఫహద్ మనవడు, బంధువులున్నట్లు సమాచారం. మరికొందరిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అరెస్టయిన రాజులు, యువరాజులు, మంత్రులు ఎక్కడ ఉన్నారో మాత్రం వెల్లడించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment