
మాస్కో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు చెప్పారు. సెయింట్ పీటర్ బర్గ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ వెల్లడించినందుకు ఆయన ప్రత్యేకంగా ట్రంప్‌కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పినట్లు రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. సెయింట్ పీటర్ బర్గ్‌లోని ప్రముఖమైన చోటు ఖజాన్ క్యాథెడ్రెల్‌పై బాంబులతో దాడులు చేసి పేల్చేయాలనుకున్నారని, అందుకు ఈ వారంలోనే కుట్ర చేశారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ వెల్లడించింది.
అయితే, ఆ కుట్రకు పాల్పడిన ఏడుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను తాము పట్టుకున్నామని, దాంతో భారీ కుట్రను భగ్నం చేసినట్లయిందని అన్నారు. ఈ విషయం తాము అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేయగాని ఆయన వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ఆయనకు, ఆయన నిఘా సంస్థకు ధన్యవాదాలు చెప్పినట్లు వెల్లడించారు. ఇలా ట్రంప్, పుతిన్ మధ్య సంభాషణ జరగడం గడిచిన వారంలోనే రెండోసారి. అంతకుముందు ద్వైపాక్షిక సంబంధాలు, ఉత్తర కొరియా విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వారు చర్చించుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment