
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోసం ఉపయోగపడే హెచ్1బీ, ఎల్1బీ వంటి వీసాలపై అగ్రరాజ్యం అమెరికా సరికొత్త, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వపక్ష నేతలు కూడా ఇలాంటి విమర్శలు చేశారు.
అయితే ట్రంప్ వలసలకు వ్యతిరేకం కాదంటూ శ్వేతసౌధం ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ, ఇండో అమెరికన్ రాజ్‌షా అన్నారు. ‘ట్రంప్‌ది వలసల వ్యతిరేక విధానం కాదు. అక్రమ వలసల వ్యతిరేక విధానం. అమెరికాకు వలస వచ్చేవారు ప్రతిభావంతులై ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అందుకోసమే వీసా జారీలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ‘ఇది పెద్ద తప్పు’ అని నేను అనుకోవడం లేదు. ఈ నిర్ణయం ఆమోదయోగ్యం. ప్రజలు దీనికి కచ్చితంగా మద్దతిస్తారు’ అని రాజ్‌షా అన్నారు.
హెచ్–1బీ వీసా బిల్లుకు అమెరికా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాజ్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హెచ్–1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు ఇటీవల అమెరికా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ఈ వీసాలకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీ చేయకుండా తాజా బిల్లులో ఆంక్షలు సిద్ధం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment