Raj shah
-
వలసలకు ట్రంప్ వ్యతిరేకం కాదు
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోసం ఉపయోగపడే హెచ్1బీ, ఎల్1బీ వంటి వీసాలపై అగ్రరాజ్యం అమెరికా సరికొత్త, కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానానికి వ్యతిరేకం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వపక్ష నేతలు కూడా ఇలాంటి విమర్శలు చేశారు. అయితే ట్రంప్ వలసలకు వ్యతిరేకం కాదంటూ శ్వేతసౌధం ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ, ఇండో అమెరికన్ రాజ్షా అన్నారు. ‘ట్రంప్‌ది వలసల వ్యతిరేక విధానం కాదు. అక్రమ వలసల వ్యతిరేక విధానం. అమెరికాకు వలస వచ్చేవారు ప్రతిభావంతులై ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. అందుకోసమే వీసా జారీలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ‘ఇది పెద్ద తప్పు’ అని నేను అనుకోవడం లేదు. ఈ నిర్ణయం ఆమోదయోగ్యం. ప్రజలు దీనికి కచ్చితంగా మద్దతిస్తారు’ అని రాజ్షా అన్నారు. హెచ్–1బీ వీసా బిల్లుకు అమెరికా ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో రాజ్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హెచ్–1బీ వీసాదారుల కనీస వేతనాన్ని పెంచుతూ సిద్ధం చేసిన బిల్లుకు ఇటీవల అమెరికా కాంగ్రెస్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో పాటు వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు చర్యలను కమిటీ ప్రతిపాదించింది. ఈ వీసాలకు భారత ఐటీ నిపుణుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని వీరితో భర్తీ చేయకుండా తాజా బిల్లులో ఆంక్షలు సిద్ధం చేసింది. -
భారతీయ సంతతి పౌరుడికి ట్రంప్ కీలక పదవి
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిపాలన వర్గంలో ఓ భారతీయ సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు దక్కాయి. రాజ్ షా అనే భారత సంతతి పౌరుడికి తన సమాచార సంబంధ వ్యవహారాల విభాగంలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శ్వేతసౌదం బుధవారం ఒక ప్రకటన చేసింది. అలాగే, తన విశ్వసనీయుడైన హోప్ హిక్స్ను కమ్యునికేషన్ డైరెక్టర్‌గా నియమించారు. అంతకు ముందు ఆయన ఇదే అంతర్గత కమ్యునికేషన్ విభాగంలో ట్రంప్‌కు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. 'అధ్యక్షుడికి రాజ్ షా కమ్యునికేషన్ విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్‌గా, ప్రిన్సిపాల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరిస్తారు' అని వైట్ హౌస్ ప్రకటించింది. కనెక్టికట్‌లో జన్మించిన రాజ్ షా కుటుంబానిది గుజరాత్. వారు 1980లోనే అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. -
ఇండో అమెరికన్‌కు రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి
వాషింగ్టన్: అమెరికాలోని భారత సంతతికి చెందిన రాజ్ షా అనే వ్యక్తికి రిపబ్లికన్ పార్టీలో అత్యున్నత పదవి లభించింది. హిల్లరీ క్లింటన్ వ్యతిరేక శిబిరంలో విమర్శకు డిగా షా కీలక పాత్ర పోషించారు. షా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో పరిశోధన, సమాచార విభాగంలో కీలక భూమికను పోషించనున్నారు. జార్జ్‌బుష్ హయాం లో అధ్యక్షుని ఉద్యోగబృంద విభాగంలో షా పని చేశారని రిపబ్లికన్ నేషనల్ కమిటీ(ఆర్ఎన్సీ) చైర్మన్ ప్రెయీబస్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత సంతతివారికి కీలక పదవులను కట్టబెట్టిన నేపథ్యంలో షా రిపబ్లికన్ల తరపున అమెరికా భారతీయులతో రానున్న ఎన్నికల్లో మంచి సంబంధాలు ఏర్పరచగలరని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఒబామా ప్రభుత్వంలోని కీలక బాధ్యతల నుంచి రాజ్షా గతవారమే తప్పుకోవడం గమనార్హం.