ఆ యాప్‌ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి! | Rapid Growth Of Matchmaking App Dil Mil | Sakshi
Sakshi News home page

‘దిల్‌ మిల్‌’తో షాదీ జరూర్‌!

Published Sun, Dec 1 2019 11:12 AM | Last Updated on Sun, Dec 1 2019 5:13 PM

Rapid Growth Of Matchmaking App Dil Mil - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ పది శాతానికి మించడం లేదు. మిగతా 90 శాతం పెళ్లిళ్లు పెద్దలు నిశ్చియించన ‘అరేంజ్డ్‌ మ్యారేజెస్‌’ లేదా ‘సెమీ అరెంజ్డ్‌ మ్యారేజెస్‌’ జరుగుతున్నాయి. అరేంజ్డ్‌ మ్యారేజెస్‌ అంటే ముఖ పరిచయం కూడా లేకుండా పెద్దలు, మధ్యవర్తులు కుదుర్చిన పెళ్లిళ్లు కాగా, మిత్రుల ద్వారానో, పెద్దల ద్వారానో పరిచయమై ఒకరికొకరు కొంత అర్థం చేసుకుని చేసుకొనే పెళ్ళిళ్లను సెమీ అరేంజ్డ్‌ మ్యారేజెస్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఇదివరకు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెన్సీలు, సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికామ్‌ కాలంలో డేటింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. 

భారత్, ఇతర దక్షిణాసియా దేశాల యువతీ యువకుల కోసం శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్‌ మిల్‌’ యూప్‌ యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్‌ దేశాల్లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్‌ ద్వారా రెండు కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి ప్రధాన కారణమని ‘దిల్‌ మిల్‌’ వ్యవస్థాపకులు, సీఈవో కేజే దలివాల్‌ ఇటీవల ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. నామ మాత్రపు పెట్టుబడితో మొదలైన ఈ యాప్‌ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్‌ విజయానికి ‘డేటింగ్‌ డాట్‌ కామ్, డేట్‌మైఏజ్, లవింగ్‌ఏ, టుబిట్, అనస్థేసియా డేట్, చైనాలవ్‌...’ తదితర డేటింగ్‌ వెబ్‌సైట్లు ఎంతో కారణమని కూడా దలివాల్‌ పేర్కొన్నారు. 

అమెరికా, కెనడాలతోపాటు బ్రిటన్, ఇతర యూరప్‌ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ, యువకుల కోసమే ఈ ‘దిల్‌ మిల్‌’ యాప్‌ను అభివృద్ధి చేశారు. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ యువకుల్లో 80 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడానికే ఇష్ట పడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వారిని తమ యాప్‌ ప్రధానంగా ఆకర్షిస్తోందని దలివాల్‌ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ యాప్‌ ద్వారా కలసుకుంటారని దిల్‌ మిల్‌ అంచనా వేస్తోంది. 



ఈ యాప్‌ను 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ప్రాయం వారు ఉపయోగిస్తున్నప్పటికీ వారిలో 25 ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియాకు చెందిన తొలి, రెండో తరంలో  ఈ యాప్‌కు ఎక్కువ మార్కెట్‌ ఉంది. మహిళల కేంద్రంగా ఏర్పడిన ‘బంబుల్‌’ తరహాలోనే ఈ దిల్‌ మిల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ యాప్‌ ద్వారా మహిళలు  కేవలం ఎన్‌ఆర్‌ఐలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ద్వారా సొంత సామాజిక వర్గాలను చెందిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఒకరితో షేర్‌ చేసుకునే సమాచారం, ఫొటోలు వారిద్దరు మినహా మరొకరు చూసే అవకాశం, షేర్‌ చేసుకునే ఆస్కారం అసలు ఉండదు. 

యువతీ యువకులు ముఖాముఖి కలుసుకుని ముచ్చటించుకునేందుకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా యాప్‌ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇటీవల న్యూయార్క్‌ సిటీలో అలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.  సంగీతం పట్ల యువతీ, యువకులకు ఆసక్తి కలిగించడంతోపాటు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో కూడా బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టితో ఓ వీడియాను, ప్రేమంటే ఏమిటో చెప్పడానికి ‘లవ్‌ ఈజ్‌’ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement