matchmaking service
-
షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం
పాపులర్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ వేయని అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కోసం ఓ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. LGBTQ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) కమ్యూనిటీ, విదేశాల్లో నివసించేవాళ్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్ సేవల్ని అందించబోతుందట షాదీడాట్‌కామ్. సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్స్‌పై అవాంతరాలను సుప్రీం కోర్టు తీర్పు తొలగించిన నాలుగేళ్లకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే షాదీడాట్‌కామ్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ‘వివిధ ప్రాంతాలను, దేశాలను, జెండర్లను దృష్టిలో పెట్టకుని ఈ అడుగు వేస్తున్నాం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయినా ఫర్వాలేదు. కేవలం అవసరం అయినవాళ్లకు ‘తోడు’ అందించాలనే దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని సీఈవో అనుపమ్ మిట్టల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి లాభాపేక్షకు దూరంగా ఉంటోంది షాదీడాట్‌కామ్. వాస్తవానికి కాజువల్ డేటింగ్ కంపెనీల్లాంటివి ఈ ఏడాదిలో సగం బిలియన్ దాకా ఆదాయం వెనకేసుకున్నాయనే అంచనాల నడుమ.. షాదీడాట్‌కామ్ మాత్రం ఆ లిస్ట్‌కు పూర్తి దూరంగా ఉంది. జీవిత భాగస్వామిని వెతకడం తామోక వ్యాపారంగా చూడట్లేదని ప్రకటించుకుంటోంది షాదీడాట్‌కామ్. మరిన్ని సర్వీసులు.. 1996లో Sagaai.comగా మొదలై ఆ తర్వాత షాదీడాట్‌కామ్ గా పేరు మార్చేసుకుంది. భారత్‌తో పాటు పాక్, బంగ్లాదేశ్, మరికొన్ని దేశాల్లో మ్యాచ్‌మేకింగ్ సెంటర్లతో రిటైల్ నెట్‌వర్క్‌లను సైతం నడిపిస్తోంది. భారత్‌మ్యాట్రిమోనీ, జీవన్సాథీ డాట్కామ్లకు గట్టిపోటీ ఇస్తోంది. వీటితో పాటు కమ్యూనిటీలకు తగ్గట్లు సంగం పేరుతో మరో ప్లాట్‌ఫామ్‌ను నడిపిస్తోంది. కరోనా టైంలో షాదీమీట్ పేరుతో వెడ్డింగ్ ప్రిపరేషన్ గైడ్‌ను లాంఛ్ చేసింది. తద్వారా ఆన్లైన్లోనే తోడు వెతుక్కునేందుకు లక్షల మందికి వీలు కలిగింది. అయితే ఈ ఐడియా అనుకున్నంత సక్సెస్ కాపోయినా.. పెద్ద నష్టమేమీ లేదని ప్రకటించుకుంది కంపెనీ. -
ఆ యాప్ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు జరిగాయి!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ పది శాతానికి మించడం లేదు. మిగతా 90 శాతం పెళ్లిళ్లు పెద్దలు నిశ్చియించన ‘అరేంజ్డ్ మ్యారేజెస్’ లేదా ‘సెమీ అరెంజ్డ్ మ్యారేజెస్’ జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ముఖ పరిచయం కూడా లేకుండా పెద్దలు, మధ్యవర్తులు కుదుర్చిన పెళ్లిళ్లు కాగా, మిత్రుల ద్వారానో, పెద్దల ద్వారానో పరిచయమై ఒకరికొకరు కొంత అర్థం చేసుకుని చేసుకొనే పెళ్ళిళ్లను సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఇదివరకు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెన్సీలు, సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికామ్ కాలంలో డేటింగ్ యాప్‌లు, వెబ్సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. భారత్, ఇతర దక్షిణాసియా దేశాల యువతీ యువకుల కోసం శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్ మిల్’ యూప్ యమ స్పీడ్‌గా దూసుకుపోతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా రెండు కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి ప్రధాన కారణమని ‘దిల్ మిల్’ వ్యవస్థాపకులు, సీఈవో కేజే దలివాల్ ఇటీవల ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. నామ మాత్రపు పెట్టుబడితో మొదలైన ఈ యాప్ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్ విజయానికి ‘డేటింగ్ డాట్ కామ్, డేట్మైఏజ్, లవింగ్ఏ, టుబిట్, అనస్థేసియా డేట్, చైనాలవ్...’ తదితర డేటింగ్ వెబ్సైట్లు ఎంతో కారణమని కూడా దలివాల్ పేర్కొన్నారు. అమెరికా, కెనడాలతోపాటు బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ, యువకుల కోసమే ఈ ‘దిల్ మిల్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ యువకుల్లో 80 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడానికే ఇష్ట పడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వారిని తమ యాప్ ప్రధానంగా ఆకర్షిస్తోందని దలివాల్ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ యాప్ ద్వారా కలసుకుంటారని దిల్ మిల్ అంచనా వేస్తోంది. ఈ యాప్‌ను 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ప్రాయం వారు ఉపయోగిస్తున్నప్పటికీ వారిలో 25 ఏళ్ల వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియాకు చెందిన తొలి, రెండో తరంలో ఈ యాప్‌కు ఎక్కువ మార్కెట్ ఉంది. మహిళల కేంద్రంగా ఏర్పడిన ‘బంబుల్’ తరహాలోనే ఈ దిల్ మిల్‌ను ఏర్పాటు చేసినప్పటికీ ఈ యాప్ ద్వారా మహిళలు కేవలం ఎన్ఆర్ఐలనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా సొంత సామాజిక వర్గాలను చెందిన వారిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యాప్‌కు మరో ప్రత్యేకత ఉంది. ఒకరితో షేర్ చేసుకునే సమాచారం, ఫొటోలు వారిద్దరు మినహా మరొకరు చూసే అవకాశం, షేర్ చేసుకునే ఆస్కారం అసలు ఉండదు. యువతీ యువకులు ముఖాముఖి కలుసుకుని ముచ్చటించుకునేందుకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా యాప్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇటీవల న్యూయార్క్ సిటీలో అలాంటి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సంగీతం పట్ల యువతీ, యువకులకు ఆసక్తి కలిగించడంతోపాటు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో కూడా బాలీవుడ్ నటి శిల్పాశెట్టితో ఓ వీడియాను, ప్రేమంటే ఏమిటో చెప్పడానికి ‘లవ్ ఈజ్’ పేరుతో మరో వీడియోను విడుదల చేసింది. -
వాట్సాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు!
సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన వాట్సాప్ ద్వారా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. ఒంటరిగా ఉంటున్న మహిళలకు కొత్త జీవితాన్ని అందించాలని ఉద్దేశ్యంతో సౌదీ అధికారులు ఓ వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. మహిళలకు పెళ్లిళ్లు ఫిక్స్ చేయడం కోసం వాట్సాప్‌ను సాధనంగా ఎంచుకుని ఓ గ్రూపును క్రియేట్ చేశారు. పాలిగమీ పేరుతో ఎనిమిది మంది సౌదీ అధికారులు ఈ గ్రూప్‌ను రూపొందించారు. ఈ గ్రూప్‌లో ఇప్పటికే 900 మంది మహిళలు రిజిస్ట్రర్ చేసుకున్నారు. పాలీగమీ విశేషమేమిటంటే.. దానిలో విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు, పెళ్లికాని వారు పేర్లు నమోదుచేసుకోవచ్చు. మక్కా సిటీలో ఎక్కువగా డైవర్స్ కేసులు పెరిగిపోతుండటాన్ని గమనించిన అధికారులు, వారికో తోడు అందించాలనే ఉద్దేశంతో ఈ ఐడియాతో ముందుకొచ్చారు. సౌది మహిళలతో పాటు యెమెన్, మోరోకో, సిరియా, పాలస్తీనా, ఈజిస్ట్, నైజీరియా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్‌లోని మహిళలు కూడా ఈ వాట్సాప్ గ్రూప్‌లో పేర్లను నమోదుచేసుకున్నారు. ఈ వాట్సాప్ గ్రూప్‌లో పేర్లు నమోదుచేసుకున్న మహిళలు రెండో, మూడో, నాలుగో భార్యగైనా వెళ్లడానికి వారికి తాము సిద్దమని పేర్కొన్నట్టు తెలిసింది. నమోదు జాబితా ప్రకారం దీనిలో అతిపెద్ద వయసున్న అమ్మాయికి 55 సంవత్సరాలు కాగ, తక్కువ వయసున్న అమ్మాయికి 18 సంవత్సరాలు. ఎత్తు ప్రకారం చూసుకుంటే, 4'7" నుంచి 5'10" ఎత్తు ఉన్న మహిళలున్నారు. కొంతమంది మహిళలు తమకు కావాల్సిన అబ్బాయిలు ఎలా ఉండాలి, ఎలాంటి వాటిని అంగీకరించాలో కూడా ఆ గ్రూప్‌లో పేర్కొన్నారు. ఉచిత సర్వీసు ఫీజుతో వారికి పెళ్లి కుదుర్చుతామని మ్యారేజ్ అధికారులు చెప్పారు.