భారత సైన్యం పుణ్యమాని..
భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్.. పాకిస్థాన్‌కు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇన్నాళ్లూ భుజాలు భుజాలు రాసుకు పూసుకుని తిరిగిన ఉగ్రవాదులు, పాక్ సైన్యం మధ్య సంబందాలు ఇప్పుడు చెడిపోయాయి. ప్రధానంగా లష్కరే తాయిబా ఉగ్రవాదులకు, పాక్ ఆర్మీలోని వాళ్ల హ్యాండ్లర్లకు మధ్య ఇప్పుడు ఏమాత్రం సత్సంబంధాలు లేవట. సర్జికల్ స్ట్రైక్స్‌లో చనిపోయిన తమ సహచరుల మృతదేహాలను తాము తీసుకెళ్లడానికి పాక్ ఆర్మీ అంగీకరించలేదని లష్కరే ఉగ్రవాదులు మండిపడుతున్నారు. ముందుగా చనిపోయిన, గాయపడిన పాక్ సైనికులనే తరలించారు. చీకటి పడిన తర్వాత మాత్రమే ఉగ్రవాదుల మృతదేహాలను తీసేందుకు అంగీకరించారు. అలాగే గాయపడిన లష్కరే ఉగ్రవాదులకు చికిత్స కూడా అంతంతమాత్రంగానే అందిందట.
భారతదేశం వైపు నుంచి మరిన్ని దాడులు ఎదురవుతాయని ఆందోళనలో ఉన్న పాకిస్థాన్.. ఉగ్రవాద నాయకులైన హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్‌లను లాహోర్‌లోని ఒక ఆర్మీ క్యాంపునకు తరలించింది. మఫ్టీలో ఉన్న ఆర్మీ కమాండోలు వాళ్లకు భద్రత కల్పించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన వెంటనే నియంత్రణరేఖ వెంబడి ఉన్న టెర్రర్ లాంచ్‌ప్యాడ్లను పీఓకే లో 7-8 కిలోమీటర్ల దూరానికి పాక్ సైన్యం తరలించింది. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో భారత సైన్యం కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంచ్ ప్యాడ్ల మీదే దాడులు చేసింది.
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రతీకారం తీర్చుకోడానికి భారతదేశంలో మళ్లీ ఉగ్రదాడులు నిర్వహిస్తారన్న కథనాలు వచ్చాయి. కానీ, గతంలో చేసినట్లుగా 26/11 నాటి ముంబై ఉగ్రదాడి తరహాలో మళ్లీ చేస్తే మాత్రం ఈసారి భారత్ కేవలం వాటిని అడ్డుకుని ఊరుకునే పరిస్థితి లేదని, మరింత తీవ్రంగా విరుచుకు పడుతుందని సమాచారం ఉండటంతో ప్రస్తుతానికి ఏమీ చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నారు. ఇక ఉగ్రవాదులు అణు దాడులు చేసే ప్రమాదం ఉందన్న వాదనలను కూడా రక్షణ శాఖ వర్గాలు ఖండిస్తున్నాయి. పొరపాటున ఆ ఆయుధాలు వాళ్ల చేతికి వెళ్లినా.. వాటి కోడ్‌లు, సాంకేతిక వివరాలు అన్నీ తెలుసుకుని వాటిని ఆపరేట్ చేయడం మాత్రం సాధ్యం కాని పని అని అంటున్నారు.