తొలి గంటలోనే 1.2 లక్షల టికెట్ల అమ్మకాలు
రియో డి జనీరో: వచ్చే ఏడాది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో నిర్వహించునున్న ఒలింపిక్స్ 2016 టికెట్ల కోసం క్రీడాభిమానులు ఎగబడుతున్నారు. ఆన్లైన్ లో ఉంచిన తొలి గంటలో ఒలింపిక్స్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిగంటకే 1.2 లక్షల టికెట్ల విక్రయాలు జరిగాయని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. అందులో ఎక్కువగా ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ గేమ్స్ టికెట్లకు అధిక డిమాండ్ ఉందని చెప్పారు. కాగా, తొలి 8 గంటల వ్యవధిలో 2.4 లక్షల టికెట్లు అమ్ముడయినట్లు చెప్పారు. కాగా ఇతర దేశాల వారు మాత్రం అధికారిక విక్రయదారుల నుంచి మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని ఈవెంట్ ఆర్గనైజర్స్ సూచించారు.
స్వదేశం బ్రెజిల్ కోసం రెండు లక్షల టికెట్లు కేటాయించామని, తొలి రెండు లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం అభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. రియో డి జనీరో, సావో పోలో, మినాస్ గెరేస్, పరానా ఏరియాల వాళ్లు టికెట్లు కొనుగోలులో మంగళవారం అగ్రస్థానంలో ఉన్నారు. 518 గేమ్స్కు గానూ ఇంకా 400 మ్యాచ్లకు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. రియో ఒలింపిక్స్ 2016 ఆగస్టు 5-21 తేదీల మధ్య నిర్వహించనున్న విషయం విదితమే. దక్షిణ అమెరికాలో జరగనున్న తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం గమనార్హం.