రూ. 580 కోట్ల జాక్‌పాట్‌లో రూ. 403 కోట్ల విరాళం!
ఫ్రాన్స్‌లో ఓ లాటరీ విజేత ఔదార్యం
పారిస్: ఫ్రాన్స్‌లో లాటరీలో 72 మిలియన్ల యూరోలను (రూ.580 కోట్లు) గెలుచుకున్న ఓ వ్యక్తి అందులోంచి 50 మిలియన్లను (రూ.403 కోట్లు) ధార్మిక సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు శనివారం మీడియా వార్తలు తెలిపాయి. 50 ఏళ్ల ఆ వ్యక్తి తన పేరును గోప్యంగా ఉంచాల్సిందిగా కోరాడని, అతనికి వివాహం కాలేదని ఆ వార్తలు పేర్కొన్నాయి.
కాగా, హ్యుట్-గారోన్ ప్రాంతంలో ఆ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసినట్టు తెలుస్తోందని ఆర్టీఎల్ టెలివిజన్ తెలిపింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇప్పటివరకు లాటరీ విజేతలనుంచి వచ్చిన విరాళాల్లో ఇదే అత్యధికమని మీడియా వార్తలు వెల్లడించాయి. పేదల సంక్షేమంకోసం కృషిచేస్తున్న సుమారు పన్నెండు వాలంటరీ సంస్థలకు ఈ విరాళాన్ని అందచేయనున్నట్టు తెలుస్తోంది.
8.
భారత సంతతి ప్రొఫెసర్‌కు
ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్
వాషింగ్టన్: యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన భారత సంతతి ప్రొఫెసర్ అనిల్ కుల్‌కర్ణికి విద్యా, వృత్తిగతమైన అనుభవంకోసం ప్రఖ్యాత ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ లభించింది. దీంతో ఆయన భారత్‌లోని నాలుగు యూనివర్సిటీల్లో పౌష్టికాహారంతో రోగనిరోధకం అనే అంశాన్ని బోధించనున్నారు. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, పుణె యూనివర్సిటీ అనుబంధ సంస్థ దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ముంబైలోని హాఫ్‌కైన్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేయనున్నారు. ఈ ఫెలోషిప్‌కు అర్హులను జె. విలియం ఫుల్‌బ్రైట్ ఫారిన్ స్కాలర్‌షిప్ బోర్డు ఎంపిక చేస్తుంది. 12 మందితో కూడిన ఆ బోర్డును అమెరికా అధ్యక్షుడు నియమిస్తారు. ఎంపికైన వారికి అమెరికా కాంగ్రెస్ కేటాయింపులు, భాగస్వామ్య దేశంతో పాటు ప్రయివేట్ రంగం నుంచి నిధులు సమకూరుస్తారు. ఫుల్‌బ్రైట్-నెహ్రూ ఫెలోషిప్ పొందిన అమెరికా ఫ్యాకల్టీ సభ్యులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు భారత్‌లోని సంస్థల్లో టీచింగ్, పరిశోధన చేయడానికి అవకాశం కలుగుతుంది.