'మాకు రష్యాతోనే పెద్ద డేంజర్'
వాషింగ్టన్: తమకు రష్యానే పెద్ద డేంజర్ అని అమెరికా స్పష్టం చేసింది. భవిష్యత్తులో అమెరికాకు అత్యంత ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తే తొలి స్థానంలో రష్యా ఉంటుందని, ఆ తర్వాత స్థానంలో చైనా ఉంటుందని అమెరికా రక్షణ స్థావరం పెంటగాన్ వ్యూహాత్మక వ్యూహాత్మక కమాండర్ జనరల్ జాన్ ఈ హేటన్ చెప్పారు. అయితే, ప్రస్తుతం మాత్రం ఉత్తర కొరియా, ఇరాన్ మాత్రం చాలా ఆందోళనకరంగా వ్యవహరిస్తున్నాయని, ఉత్తర కొరియాను అసలు అదుపు చేసే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు.
'ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఏయే దేశాలతో బెదిరింపులు, ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశీలిస్తే రష్యా వెరీ డేంజర్ గా తొలిస్థానంలో, చైనా తర్వాత స్థానంలో తర్వాత ఉత్తర కొరియా, ఇరాన్ లు ఉన్నాయని చెబుతాను' అని హేటన్ అన్నారు. అసలు ఉత్తర కొరియా ఏం చేస్తుందో వారికే అర్ధంకావడం లేదని, అలా ఎందుకు అణు క్షిపణులు, అణ్వాస్త్రాలు పరీక్షలు చేస్తున్నారో, మిసైల్ ప్రోగ్రామ్స్ ఎందుకు నిర్వహిస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి అని ఆయన ఆందోళన చేశారు. గత 20 ఏళ్లుగా రష్యా, చైనా దేశాలను తాను పరిశీలిస్తున్నానని, ప్రపంచ యుద్ధరంగంలో ఏదేశాన్నైనా ఢీ కొట్టగలిగేలా మిలటరీ విభాగాన్ని ఆ దేశాలు వృద్ధి చేసుకున్నాయని చెప్పారు.