‘రష్యా ఫెయిలైంది.. అందుకే మేం దిగాం’
వాషింగ్టన్: సిరియా విషయంలో రష్యా విఫలమైందని అమెరికా ఆరోపించింది. రసాయన ఆయుధాల బారి నుంచి సిరియాను రక్షిస్తామని 2013లో తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడంలో ఆ దేశం ఘోర వైఫల్యం చెందిందని అమెరికా ప్రభుత్వ సహాయ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ మండిపడ్డారు. వచ్చేవారమే ఆయన మాస్కో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిధిగా తొలిసారి రష్యాలో వచ్చే వారం టిల్లర్సన్ అడుగుపెట్టనున్నారు.
ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకునేందుకు, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, గతంలో చేసుకున్న ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకునేందుకు అమెరికా ప్రతినిధిగా టిల్లర్సన్ రష్యా పర్యటనకు వెళబోతున్నారు. ఈలోగా, భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో సిరియాలోని షైరత్ వైమానిక స్థావరంపై సుమారు 60 వరకు తోమహాక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది.
తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై సిరియా వైమానిక దళం పాల్పడిన రసాయన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి చేసినట్లు చెప్పింది. ఈ దాడిని ప్రస్తుతానికి సిరియాకు అండగా ఉన్న రష్యా, ఇరాన్‌లు ఖండించాయి. ఈ నేపథ్యంలో రష్యా విఫలమైనందునే తాము రంగంలోకి దిగామంటూ అమెరికా తరుపున టిట్టర్సన్ ప్రకటన చేశారు. అంతేకాదు, సిరియా పాలకుడు బషర్ అల్ అస్సాద్ ఆదేశాలతోనే రసాయన విషవాయువుల బాంబుదాడులు జరిగాయని తమకు పూర్తి సమాచారం ఉందని కూడా ప్రకటించారు. అమాయకులైనవారిని విషవాయువులతో పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.