అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రష్యా పరిశీలకులు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో నవంబర్ 8వ తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రత్యక్ష పర్యవేక్షణకు పరిశీలకులను పంపించాలని రష్యా నిర్ణయించినట్లు రష్యా మీడియా వెల్లడించింది. అయితే అలాంటి ఆస్కారమే లేదని అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది.
రష్యా పరిశీలకులు తమ పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా అమెరికాలోని ఓ రాష్ట్ర ఎన్నికల అధికారి హెచ్చరించారు. ఇది కేవలం పీఆర్ స్టంట్ మాత్రమేనని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల పరిశీలనకు తమ అధికారులను అనుమతించాలని లూసియానా రాష్ట్ర ప్రభుత్వానికి రష్యా నుంచి ఓ విజ్ఞప్తి వచ్చిన మాట నిజమేనని, ఇదంతా ప్రచారం స్టంట్ మాత్రమేనని ఆ రాష్ట్ర విదేశాంగ విభాగం అధికార ప్రతినిధి టామ్ షెడ్లర్ విమర్శించారు. గతంలో పలు దేశాల నుంచి ఎన్నికల పరిశీలకులను తాము అనుమతించామని, అయితే ఎప్పుడూ కూడా రష్యా నుంచి అనుమతించలేదని ఆమె తెలిపారు. రష్యా నుంచి అనుమతించవద్దంటూ ఎఫ్‌బీఐ నుంచి తమకు సూచనలు, సలహాలు కూడా వచ్చాయని ఆమె తెలిపారు.
ప్రత్యర్థి అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై పలు డిబేట్లలో వెనకబడిపోయిన డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని మొదటినుంచి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా.. అని ఆయనను అమెరికా మీడియా ప్రశ్నించగా, తాను గెలిస్తేనే అంగీకరిస్తానని, లేకపోతే లేదని సమాధానం ఇచ్చారు. హిల్లరీ క్లింటన్‌తో పాటు డెమోక్రట్ల సెంట్రల్ కమిటీ ఈ మెయిళ్లను హ్యాక్ చేయడం వెనక రష్యా ప్రభుత్వం హస్తం ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.