అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్: రష్యా ప్రోగ్రామర్ అరెస్టు
గత సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా వాళ్లు హ్యాక్ చేశారని గగ్గోలు పుట్టింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ కేసులో ఒక రష్యన్ కంప్యూటర్ ప్రోగ్రామర్‌ను స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో అరెస్టు చేశారు. అతడిపేరు పయోటర్ లెవషొవ్. ఈ విషయాన్ని మాడ్రిడ్‌లోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిన హ్యాకింగ్ దాడుల్లో ఇతడి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. అమెరికా అంతర్జాతీయ అరెస్టు వారెంటుతో అతడిని అరెస్టు చేసినట్లు రష్యా రేడియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే లెవషొవ్ అరెస్టుకు కారణాలేంటో వివరంగా చెప్పేందుకు రాయబార కార్యాలయం ప్రతినిధి నిరాకరించారు.
లెవషొవ్‌ను శుక్రవారమే అరెస్టు చేసినా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిపబ్లికన అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు సాయం చేసేందుకు గాను డెమొక్రాటిక్ పార్టీ ఈమెయిళ్లను రష్యా హ్యాకింగ్ చేసిందని అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల ప్రచారం సమయంలో రష్యాకు, ట్రంప్‌కు మధ్య ఉన్న సంబంధాలు ఏంటనే విషయాన్ని అమెరికా కాంగ్రెస్ కూడా పరిశీలిస్తోంది. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఉందన్న విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పదే పదే ఖండించారు.